క్రికెటర్లను హీరోల్లా చూడొద్దు

క్రికెటర్లను హీరోల్లా చూడొద్దు

ధోని, కోహ్లీని ఆరాధించడం మానేయాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీమిండియా క్రికెట్ లోపాలను బయటకు తీసేసమయంలో ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్లను హీరోలా ఆరాధించడం ఆపేయాలని సూచించాడు. కొందరినే నెత్తినెత్తుకోవడం వల్ల మరికొందరికి రావాల్సిన ఫేమ్ రావడం లేదన్నాడు. వాళ్ల నీడలో ఇతరులకు టాలెంట్ ఉన్నా..గుర్తింపు పొందలేకపోతారని గంభీర్ చెప్పుకొచ్చాడు. గతంలో ధోనీని నెత్తినెట్టుకున్నారని.... ఇప్పుడు కోహ్లీని అంటూ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. 

భువీ గురించి ఎవరూ మాట్లాడలేదు..
ఢిల్లీలో కోహ్లీ సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్‌లోనే మీరట్‌ పట్టణానికి చెందిన భువనేశ్వర్ కుమార్ కూడా ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ ఫ్యాన్స్  కోహ్లీ గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు.  భువీ గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇది చాలా దురదృష్టకరం. భువనేశ్వర్ గురించి నేనొక్కడినే మాట్లాడా. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ.. ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. దాని గురించి అందరికీ తెలుసు.. కానీ అది ఎవరికీ పెద్ద అచీవ్‌మెంట్‌లాగా అనిపించదు...అని గంభీర్ అన్నాడు. 

హీరోలా ఆరాధించే కల్చర్ పోవాలి..
కోహ్లీ శతకం కొట్టినందుకు మాత్రం సంబరాలు చేసుకున్నారు. ఈ వివక్ష ఎందుకు. ఒకరిద్దరు ప్లేయర్లను హీరోలా ఆరాధించే  కల్చర్ నుంచి అభిమానులు బయటపడాలి. ఇది కేవలం భారత క్రికెట్ మాత్రమే కాదు.. రాజకీయాలైనా..మరో రంగమైనా... అతిగా ఆరాధించడం మొదలు పెట్టొద్దు. ఇతరులకు  గుర్తింపు రాకుండా చేయడం సమంజసం కాదు. అభిమానులు ఆరాధించాల్సింది టీమిండియానే...అని గంభీర్ వ్యాఖ్యానించాడు.