150 మట్టి కుండలతో వినాయకుడు

150 మట్టి కుండలతో వినాయకుడు

జగిత్యాల జిల్లాలో గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా స్థానికులు ప్రత్యేక కాన్సెప్ట్ లతో వినాయకులను ప్రతిష్టించారు. ఈ ఏడాది వివిధ రూపాలతో సందేశమిచ్చేలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.  కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో ఈ వెరైటీ గణపతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 

జగిత్యాల జిల్లా కోరుట్ల శాంతియూత్ సభ్యులు ఈ వినాయక చవితికి నో-ప్లాస్టిక్ కాన్సెప్ట్ తో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్లాస్టిక్ రహిత వస్తువులనే వాడాలన్న సందేశాన్ని ఇచ్చేలా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు.  గణపతిని మున్సిపల్ వర్కర్ రూపంలో ప్రతిష్ఠించారు. మున్సిపాలిటీ వర్కర్లు ప్రతి రోజు ప్లాస్టిక్ ను సేకరించడానికి గుర్తుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు బట్ట సంచులు వాడాలని తెలియజేసేలా గణపతి చేతిలో ఓ బట్ట సంచినీ ఏర్పాటు చేశారు. ఎలకలు ప్లాస్టిక్ ను ఏరుతున్నట్లుగా డిజైన్ చేశారు. 

మట్టి కుండల ప్రాముఖ్యత తెలిసేలా..

కోరుట్ల రవీంద్ర రోడ్డులోని నవతరం యూత్ సభ్యులు మానవుని జీవితంలో మట్టి కుండల ప్రాముఖ్యతను తెలుపుతూ 150 మట్టి కుండలతో గణపతిని ప్రతిష్టించారు. వినాయకుడి  దగ్గర పూజకు ఉపయోగించే ప్రమిదలను మట్టితో చేసినవి వాడుతున్నారు. ఐదేళ్లుగా వినూత్న పద్ధతిలో గణపతులను నిర్వాహకులంతా కలసి స్వయంగా తయారు చేస్తున్నారు.

వృత్తులను గుర్తించేలా వినాయకులు

జగిత్యాల పట్టణంలోని పోచమ్మ వీధిలోని యువకులు గాలిలో తేలాడే విధంగా రంగురాళ్ల గణపతిని ఏర్పాటు చేశారు. శూలం సహాయంతో ప్రతిష్ఠించిన గణపతిని.. చూస్తే గాలిలో తేలుతున్నట్లుగాకనిపిస్తాడు. గాంధీ రోడ్డులో కోరుట్ల కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో తమ వృత్తి ప్రాముఖ్యతను తెలిపేలా కెమెరా సెట్టింగ్ లో వినాయకుడిని ప్రతిష్టించారు. మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో గౌడ్స్ యూత్ ఆధ్వర్యంలో తమ కుల వృత్తిని తెలియజేసేలా తాటి, ఈత చెట్ల మధ్య విఘ్నేశ్వరున్ని ఏర్పాటు చేశారు. పదేళ్లుగా వినాయక ఉత్సవాలను జరుపుతున్నారు. కోరుట్లకు చెందిన కళాకారునితో ఈసారి ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ వెరైటీ గణనాథుడు భక్తులను విశేషంగా ఆకర్శిస్తున్నాడు. రెండేళ్లుగా కరోనా వల్ల వినాయక ఉత్సవాలు మామూలుగా జరిగాయి. ఈసారి డిఫరెంట్ గా విగ్రహాలను ప్రతిష్టించి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.