గణపురంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్​

గణపురంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్​

భూపాలపల్లి అర్బన్, వెలుగు: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో డీఎస్పీ సంపత్​రావు వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణాపై సమాచారం రావడంతో డీఎస్పీ, చిట్యాల సీఐ మల్లేశ్​ఆదేశాలమేరకు గణపురం ఎస్సై తన సిబ్బందితో కలిసి రవినగర్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆటోలో వెళ్తుండగా, పట్టుకుని తనిఖీ చేయగా డ్రైవర్ సీటు కింద సుమారు 2 కేజీల గంజాయి కవర్​ కనిపించింది.

దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా,  దాసరి రాములు(55), మిట్టపల్లి నిషాంత్​(28) డబ్బుల కోసం కొద్ది రోజులుగా ఒరిస్సాలోని మల్కాన్​గిరి జిల్లా కొండ పరివాహక ప్రాంతంలోని రమేశ్​అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి భూపాలపల్లి, గణపురం మండలాల పరిధిలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.