మూడు నెలల నుంచి జీతాల్లేవ్​..26 నుంచి సమ్మె చేస్తం

మూడు నెలల నుంచి జీతాల్లేవ్​..26 నుంచి సమ్మె చేస్తం
  • డ్యూటీలు బహిష్కరించి ఆందోళన
  • సర్కార్ పెద్దల్లారా మా ఉసురు తగుల్తది
  • జీతాలు పెంచాలని, టైంకు ఇవ్వాలని డిమాండ్

పద్మారావునగర్ (హైదరాబాద్), వెలుగు‘‘దశాబ్దాలుగా కేవలం రూ.8,500 జీతంతో పని చేస్తున్నం. ప్రాణాలకు తెగించి దవాఖానాలో రోగులకు సేవ చేస్తున్నం. కానీ ప్రభుత్వం మమ్మల్ని మానవతా దృక్పథంతో చూడటం లేదు. మాపై తీవ్ర వివక్ష చూపుతోంది. మా ఉసురు పోసుకుంటోంది” అంటూ గాంధీ ఔట్​సోర్సింగ్​, కాంట్రాక్ట్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకున్న ఔట్​సోర్సింగ్ సిబ్బందికి 3 నెలలుగా, కాంట్రాక్ట్​ సిబ్బందికి 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. శనివారం అన్ని డిపార్ట్​మెంట్ల ఔట్​సోర్సింగ్​ సిబ్బంది గంట సేపు డ్యూటీలను బహిష్కరించి ఆందోళన చేశారు.

ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలివ్వాలె

కరోనా వార్డుల్లో 9 నెలలుగా ప్రాణాలకు తెగించి పేషేంట్ కేర్, సెక్యూరిటీ, స్వీపర్లుగా డ్యూటీలు చేస్తున్నా పెద్దాఫీసర్లు కనికరించడం లేదని ఔట్​సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాంట్రాక్టర్ తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిని తొలగించి తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రతినెల 5 వ తేదీ లోపు జీతాలు ఇవ్వాలని, తమ జీతాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ స్వీపర్లకు రూ.17,500 చెల్లిస్తున్న సర్కార్.. తమను మాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. మాకు ఓట్లు లేవా? మేం మనుషులం కాదా? అని ప్రశ్నించారు.

26 నుంచి సమ్మె చేస్తం

తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 26 నుంచి సమ్మె చేస్తామని ఔట్​సోర్సింగ్ సిబ్బంది హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ భూపాల్, గాంధీ యూనిట్ ప్రెసిడెంట్ కుమారస్వామి, నాయకులు లక్ష్మీపతి, సీహెచ్.లక్ష్మి, వందలాది మంది సిబ్బంది పాల్గొన్నారు.