ఇథనాల్​ఫ్యాక్టరీకి నీళ్ల కోసం..కృష్ణానదికి గండి!

ఇథనాల్​ఫ్యాక్టరీకి నీళ్ల కోసం..కృష్ణానదికి గండి!
  •     భీమా ప్రాజెక్టు నుంచి 0.2 టీఎంసీల నీటి కేటాయింపులు
  •     బోర్డర్‌‌లోని కృష్ణానది వద్ద కెనాల్​తవ్వకాలు చేపట్టిన కంపెనీ ప్రతినిధులు
  •     పనులు ఆపాలని రెండు వారాలుగా ఆందోళనకు దిగుతున్న రైతులు
  •     వాటర్ పాయింట్, డిజైన్​పర్మిషన్​లేకపోవడంపై ఇరిగేషన్ శాఖ నోటీసులు

మహబూబ్‌నగర్, వెలుగు : నారాయణపేట జిల్లా కృష్ణా మండలం హిందూపూర్​ గ్రామ శివారులోని ఇథనాల్​ఫ్యాక్టరీకి కావాల్సిన నీటి కోసం కంపెనీ ప్రతినిధులు కృష్ణానదికి గండి కొడుతున్నారు.  ఈ కంపెనీకి భీమా ప్రాజెక్టు నుంచి నీటి కేటాయింపులుంటే.. రాష్ట్ర సరిహద్దులోని నది నుంచి ఫ్యాక్టరీ వరకు కెనాల్ తవ్వుతున్నారు. పక్కనే మినీ లిఫ్ట్​ ఉన్నా... దానిని ఆనుకొని ఈ​ పనులు చేపడుతున్నారు.  విషయం తెలుసుకున్న రైతులు పనులు ఆపాలని ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇలాంటి పరిస్థితుల్లో నది నుంచి కెనాల్‌ తవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

25 ఎకరాల్లో ఫ్యాక్టరీ

హిందూపూర్ గ్రామ శివారులో 25 ఎకరాల్లో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఆరు నెలల కింద పనులను ప్రారంభించగా..  ప్రస్తుతం 40 శాతానికి పైగా పూర్తయ్యాయి.  ఇథనాల్​ఆయిల్ తయారీకి పెద్ద మొత్తంలో నీరు అవసరం ఉండటంతో 0.2 టీఎంసీల నీటిని భీమా ప్రాజెక్టు నుంచి తీసుకునేందుకు ఈ కంపెనీకి అనుమతులు ఉన్నాయి. కానీ,  కంపెనీ ప్రతినిధులు కర్నాటక,-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కృష్ణానది వద్ద జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నారు. 

నదిలోకి జేసీబీలను దింపి 8 ఫీట్ల వెడల్పు, 12 ఫీట్ల లోతు కెనాల్​ను తవ్వుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రెండు వారాలుగా ఆందోళనకు దిగుతున్నారు. మొదట్లో పనులు బంద్​ చేసి అక్కడి నుంచి వెళ్లిన కంపెనీ వారు, ఇటీవల మళ్లీ వచ్చి పనులు మొదలు పెట్టారు. దీనిపై సీరియస్​ అయిన రైతులు, స్థానిక ప్రజలు పనులను మళ్లీ అడ్డుకోవడంతో నాలుగు రోజుల కింద కెనాల్​ పనులు ఆపేశారు. 

ఇన్ఫర్మేషన్​ బయటకు రానివ్వకుండా..

నారాయణపేట జిల్లాలో ఇది రెండో ఇథనాల్​ ఫ్యాక్టరీ. మొదటిది మరికల్​మండలం చిత్తనూరు వద్ద ఉండగా.. ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థాలను సమీప పొలాలు, కుంటల్లో పారబోస్తున్నారని 23 అక్టోబర్‌‌, 2023న చిత్తనూరు, ఎక్లాస్​పూర్​, జిన్నారం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీలోకి వాహనాలు రానివ్వకుండా రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. 

లాఠీచార్జి చేయడంతో ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘటన తర్వాత హిందూపూర్​వద్ద రెండో ఇథనాల్​ఫ్యాక్టరీ పనులు ప్రారంభించారు. అయితే ఇథనాల్​ఫ్యాక్టరీ అని తెలిస్తే ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుందనే ఉద్దేశంతో  రైస్​ మిల్లులు, కోల్డ్​ స్టోరేజీలను నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.  కానీ అక్కడ కృత్రిమ చెరువు, భారీ స్థాయిలో బాయిలర్లు ఏర్పాటు చేయడం, ఇటీవల నది నుంచి కెనాల్​తవ్వడంతో ప్రజలు ఆరా తీశారు. ఇథనాల్​ఫ్యాక్టరీ కడుతున్నట్లు తేలడంతో ఆందోళనకు దిగారు.

భీమా నీరు ఎలా సాధ్యం?

20 టీఎంసీల నీటి కేటాయింపులతో భీమా ప్రాజెక్టును నిర్మించారు. నీటి కేటాయింపుల ఆధారంగా ఈ ప్రాజెక్టులోని సంగంబండ, భూత్పూర్​ రిజర్వాయర్ల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్​, ఆత్మకూరు, మాగనూరు, నర్వ, వనపర్తి, వీపనగండ్ల, పెద్దమందడి మండలాలకు సాగు, తాగునీటిని అందిస్తున్నారు. దీనికితోడు గత ప్రభుత్వం పదేండ్లు పక్కకు పెట్టిన ‘కొడంగల్–నారాయణపేట’ స్కీమ్‌కు ఇటీవల  సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌కు భీమా ద్వారా 7 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు ఇరిగేషన్​ మినిష్టర్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రకటించారు. మరి ఇథనాల్​ ఫ్యాక్టరీకి  భీమా ద్వారానే నీటిని కేటాయింపులు ఉన్నా...  నీరు ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

నోటీసులు ఇచ్చి రీస్టోర్​ చేయమన్నం

ఇథనాల్​ఫ్యాక్టరీకి వాటర్ అలాట్​మెంట్ ఉంది. కానీ వాటర్​తీసుకునే పాయింట్​, డిజైన్​ అప్రూవల్​ కోసం ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ నుంచి పర్మిషన్​ తీసుకోవాలి. పర్మిషన్​ లేకపోవడంతో తవ్వకాల పనులను నిలిపివేయాలని నోటీసులు ఇచ్చాం. తీసిన మట్టిని మొత్తం రీస్టోర్​ చేయాలని ఆదేశించాం. ఒకవేళ వారికి పర్మిషన్‌  వచ్చినా.. కేవలం వరదల సమయంలోనే మాత్రమే నీటిని తీసుకొని స్టోర్​ చేసుకోవాలి. ఎండాకాలంలో, నీటి ప్రవాహనం లేని సమయాల్లో నీటిని తీసుకోరాదు.
- వెంకటరమణ, డీఈ, మక్తల్