ఉమ్మడి ఆదిలాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి సిద్ధం

ఉమ్మడి ఆదిలాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి సిద్ధం
  • జిల్లా కేంద్రాల్లో నేడే నిమజ్జనం
  • ఆదిలాబాద్​లో 600 మంది, మంచిర్యాలలో 600 నిర్మల్​లో 500 మంది పోలీసులతో బందోబస్తు
  • భారీగా సీసీ కెమెరాలు, స్పెషల్ టీంలతో నిత్యం పర్యవేక్షణ
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు

ఆదిలాబాద్/మంచిర్యాల/నిర్మల్, వెలుగు:  నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. శోభాయాత్ర, నిమజ్జనోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే నిమజ్జనం జరగ్గా.. చివరి రోజైన శనివారం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా కేంద్రాలతోపాటు ఆయా పట్టణాలు, గ్రామాల్లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. దీంతో వారం రోజులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నిమజ్జనానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఆదిలాబాద్​లో 350 సీసీ కెమెరాలతో.. 

ఆదిలాబాద్ పట్టణంలో పోలీసు శాఖ 600 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పట్టణాన్ని 8 క్లస్టర్లు, ఎనిమిది సెక్టార్లుగా విభజించి అడుగడుగునా పోలీసు సిబ్బందిని నియమించారు. వీరితోపాటు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు పట్టణంలో 15 మంది వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. సమస్యలు సృష్టించే వారిని వీడియోల్లో గుర్తించనున్నారు.

డ్రోన్ కెమెరాలతో పట్టణంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. 20 మంది స్పెషల్ బ్రాంచ్​కే చెందిన రెండు బృందాలు మఫ్టీలో ఉండి ఆకతాయిలను, ప్రజలను రెచ్చగొట్టేవారిపై దృష్టి పెట్టనున్నారు. పట్టణంలోని ఒక్క దారిలో సెక్టార్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టనున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐల పర్యవేక్షణలో పట్టణంలో బందోబస్తు కొనసాగనుంది.

నిర్మల్​లో నిఘా నీడలో నిమజ్జనం

నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో రెండ్రోజులపాటు నిమజ్జన శోభాయాత్రలు సాగుతాయి. ఈ నేపథ్యంలోనే శోభాయాత్ర సాగే అన్ని ప్రధాన కూడళ్లలో మొత్తం 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్​తో అనుసం ధానం చేశారు. మొత్తం 508 మంది పోలీసు సిబ్బందిని నియమించి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. డీజేలను పరిమితికి లోబడి మాత్రమే వినియోగించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ జానకీ షర్మిల హెచ్చరించారు. 

ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా, టౌన్ ఇన్​స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భద్రతా చర్యల పర్యవేక్షణ కొనసాగనుంది. ఒక అడిషనల్ ఎస్పీతో పాటు ఇద్దరు ఎస్పీలు, 11 మంది ఇన్​స్పెక్టర్లు, 31 మంది ఎస్సైలు, 16 మంది ఏఎస్సైలు, 303 మంది హెడ్ కానిస్టేబుల్స్, 31 మంది మహిళా పోలీసులు బందోబస్తు చర్యలో పాల్గొంటున్నారు. శివంగి టీములను కూడా రంగంలోకి దించనున్నారు. గణేశ్ మండల సభ్యులు శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా సహకరించాలని ఎస్పీ కోరారు. 

నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు 

మంచిర్యాల జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 2300లకు పైగా గణపతి మండపాలు ఏర్పాటు కాగా శుక్రవారం బెల్లంపల్లి, లక్సెట్టిపేట, మందమర్రితో పాటు జన్నారం తదితర ప్రాంతాల్లో 1080 విగ్రహాలను నిమజ్జనం చేశారని తెలిపారు. మంచిర్యాలతో పాటు మిగతా ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నిమజ్జనం జరుగుతుందన్నారు. బందోబస్తు కోసం ముగ్గురు ఏసీపీలు, ఎనిమిది మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 600 సిబ్బందిని నియమించామని చెప్పారు. 

మూడు ఫీట్ల వరకున్న విగ్రహాలను మంచిర్యాల, ముల్కల్ల, సీతారాంపల్లి గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశామని, అంతకంటే పెద్ద విగ్రహాలను ఇందారం, గూడెం గోదావరి బ్రిడ్జిల దగ్గర నిమజ్జనం చేయడానికి పెద్ద క్రేన్లు అందుబాటులో ఉంచామన్నారు. 15 మంది గజ ఈతగాళ్లను గోదావరి దగ్గర సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో విగ్రహాలను మధ్యాహ్నం 3 గంటలకు శోభాయాత్ర ప్రారంభించి రాత్రి 7 గంటల వరకు మంచిర్యాల ముఖరం చౌరస్తా చేరుకోవాలని, 12 గంటల్లోగా నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.