
- గంగమ్మ ఒడికి గణనాథులు
వెలుగు నెట్వర్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులకు చివరి రోజు శనివారం ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర చేపట్టారు. గణేశ్ శోభాయాత్రలకు దారి పొడవునా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన శోభాయాత్రలో ఆయా మండపాల నిర్వాహకులు నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు. డీజే పాటలతో వీధులు దద్దరిల్లాయి. ఆదిలాబాద్ లోని వినాయక్ చౌక్ సరస్వతీ శిశుమందిర్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వజనిక గణేశ్ నిమజ్జన శోభాయాత్రను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ నంబర్ వన్ గణేష్ విగ్రహానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎస్పీ జానకీ షర్మి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వినాయక మండలి సభ్యులతో కలిసి డ్యాన్స్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. వినాయక నిమజ్జన వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం గంగమ్మ ఒడికి గణనాథులు చేరుకున్నాయి. గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, పోలీసు అధికారులు సూచించినప్పటికీ నిమజ్జన వేడుకలు మాత్రం జిల్లాలో రెండు రోజులపాటు జరుగుతున్నాయి. –