భారీ బందోబస్తు నడుమ గణేశ్​శోభాయాత్ర

భారీ బందోబస్తు నడుమ గణేశ్​శోభాయాత్ర

మూడు పోలీస్​ కమిషనరేట్ల పరిధిలో జరిగిన గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జనాలకు దాదాపు నలభై వేల మంది పోలీసులు, పద్దెనమిది వేల సీసీటీవీ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హోంమంత్రి మహమూద్‌‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌‌‌‌, సీపీ సీవీ ఆనంద్‌‌ సమీక్షించారు. బేగంపేట్‌‌ ఎయిర్‌‌‌‌ పోర్ట్‌‌ నుంచి హెలికాప్టర్‌‌‌‌ ద్వారా ఏరియల్ వ్యూ చేశారు. బంజారాహిల్స్‌‌ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్‌‌ సెంటర్‌‌లో 2,306 సీసీటీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన మెగా స్క్రీన్‌‌ ద్వారా స్థానిక పరిస్థితులను  పర్యవేక్షించారు. 

మూడు కమిషనరేట్ల పరిధిలో శోభాయాత్ర, నిమ జ్జనాలను సీపీలు సీపీ ఆనంద్‌‌, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్‌‌ చౌహన్‌‌ పర్యవేక్షించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌‌‌‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర చాంద్రాయణగుట్ట మీదుగా సిటీ కమిషనరేట్‌‌ పరిధిలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ఓల్డ్‌‌ సిటీ మీదుగా 19 కి.మీటర్లు సాగింది. ఓల్డ్‌‌ సిటీలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.

సున్నిత ప్రాంతాల్లో  టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. ఇంటెలిజెన్స్‌‌ పోలీసులతో స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.  ‘‘ గణేశ్​ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇందులో గురువారం సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 60 వేల నుంచి 65 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు జరుగలేదు’’ అని డీజీపీ -అంజనీ కుమార్ మీడియాకు చెప్పారు. 

డ్యాన్సు చేసిన పోలీసులు

ఎన్టీఆర్‌‌‌‌ మార్గ్‌‌ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు  భక్తులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.  ఖైరతాబాద్ గణేష్‌‌ మండప నిర్వాహకులతో కలిసి సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌‌ కుమార్‌‌‌‌, పోలీస్ సిబ్బంది స్టెప్పులు వేశారు. చాంద్రాయణగుట్టలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్‌‌ తీన్మార్‌‌‌‌ స్టెప్పులు వేశారు. గణేశ్​ మండపం ముందు యువతులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. చార్మినార్ వద్ద గణపతి శోభాయాత్రలకు ముస్లింలు స్వాగతం పలికారు. ప్రసాదాలు పంచారు.