
వీళ్లకు వీళ్లే ప్రభుత్వం.. వీళ్లే అధికారులు.. పాస్ పుస్తకాలు ఇవ్వగలరు.. బ్యాంకు లోన్లు కూడా ఇప్పించగలరు. ప్రభుత్వంతో పనిలేదు.. అధికారుల అవసరం అసలే లేదు. నకిలీ పట్టాధార్ పాస్ పుస్తకాలు తయారు చేస్తూ.. రైతులకు విక్రయిస్తున్న ముఠాను శుక్రవారం (ఆగస్టు 29) పోలీసులు అరెస్టు చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో నకిలీ పట్టాధార్ పాస్ పుస్తకాలు తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు . కురవి మండల కేంద్రంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారుచేసి రైతులకు పదివేల రూపాయలు చొప్పున అమ్ముతున్నారు దుండగులు. అంతే కాకుండా ఈ నకిలీ పాస్ బుక్స్ తో బ్యాంకు లోన్లు ఇప్పిస్తుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
స్థానికుల సమాచారం మేరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి కొంతమంది పరారిలో ఉన్నారు. నిందితుల నుంచి రెండు కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, 1 ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 16 మంది పేరుతో తయారుచేసిన నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు పోలీసులు.