
హైదరాబాద్, వెలుగు: నాగోల్‌లో జరిగిన కాల్పులు, గోల్డ్ చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. 10మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాలో మంగళవారం ఆరుగురిని అరెస్ట్ చేశారు. రెక్కీ టైంలో ముఠాలోని ఓ సభ్యుడు వేసుకున్న రెడ్ షర్ట్, హోండా యాక్టివానే వీరిని పట్టించింది. దోపిడీ టైంలో కూడా ఆ వ్యక్తి అదే రెడ్ షర్ట్‌తో పాటు సేమ్ హోండా యాక్టివాను ఉపయోగించాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసులో పురోగతి సాధించారు. ఈ గ్యాంగ్ నుంచి రూ.1.35 కోట్లు విలువ చేసే 2.7 కిలోల బంగారం, 3 కంట్రీమేడ్ పిస్టల్స్, 25 లైవ్ రౌండ్స్, ఎయిర్ పిస్టల్, పెల్లట్స్, పల్సర్, హోండా యాక్టివా, మహేంద్ర జీప్, 6 సెల్‌ఫోన్స్, రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సహా మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీ వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం వెల్లడించారు.
రాజస్తాన్ దొంగల ముఠా
రాజస్తాన్‌కు చెందిన మహేందర్ (35) సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జ్యూవెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. రెడీమేడ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేయించి మార్కెట్ చేసేవాడు. భార్య గుడియా (38), బావ మరిది సుమీర్ చౌదరి (26) కూడా జ్యూవెలరీ షాప్స్ నిర్వహిస్తున్నారు. జనగాం జిల్లా పాలకుర్తి, సిద్దిపేట్ జిల్లా కొండపాకలో షాప్స్ నిర్వహిస్తున్న రాజస్తాన్ వ్యాపారులు మనీశ్ వైష్ణవ్ (31), రితీశ్ వైష్ణవ్ (32), మెదక్ జిల్లా రామాయంపేట్‌లో క్లాత్ షోరూమ్ నిర్వహిస్తున్న బన్సీరామ్(23)తో కలిసి మహేందర్ దోపిడీకి ప్లాన్ చేశాడు. దీని కోసం హర్యానా, రాజస్తాన్‌కు చెందిన సుమిత్ డాగర్ (30), మనీశ్(28), మన్య(26)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. హర్యానాలో కంట్రీమేడ్ పిస్టల్స్, ఎయిర్ పిస్టల్, డాగర్ కొన్నారు. బేగంబజార్, సికింద్రాబాద్‌లోని రెడీమేడ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తయారీ షాపులు, సప్లయ్ చేసే వారిని టార్గెట్ చేశారు.
దోపిడీ కోసం హోండా యాక్టీవా చోరీ
మహేందర్ సూచనలతో సుమిత్ డాగర్, మనీశ్, మన్య అక్టోబర్‌లోనే సిద్దిపేట వచ్చారు. అక్టోబర్ 26న సిద్దిపేట జిల్లా గౌరారం పీఎస్ లిమిట్స్‌లో హోండా యాక్టివాపై వెళ్తున్న వ్యక్తిని పిస్టల్‌తో బెదిరించి దాన్ని ఓ ట్రావెల్ బస్‌లో రాజస్తాన్ పార్సిల్ చేశారు. తర్వాత ముగ్గురు హర్యానా వెళ్లారు. మళ్లీ నవంబర్ 20న యాక్టివాతో మెదక్ జిల్లా రామాయంపేట్ వచ్చారు.. 29న గజ్వేల్‌లోని బజాజ్ షోరూమ్‌లో పల్సర్ బైక్ కొన్నారు. దీంతో పాటు హోండా యాక్టివా బైక్‌పై డిసెంబర్ 1న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ మోండా మార్కెట్‌కు వచ్చారు. బన్సీరామ్‌తో కలిసి మన్య, సుమిత్ డాగర్, మనీశ్ నాలుగు బైకులపై సికింద్రాబాద్ చేరుకున్నారు. మోండా మార్కెట్‌కు చెందిన బంగారం వ్యాపారి రాజ్ కుమార్ సురాన ఆర్డర్స్‌పై రెడీమేడ్ బంగారు ఆభరణాలు సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే రాజ్‌కుమార్ షాప్ గోల్డ్ ట్రాన్స్‌పోర్ట్‌పై రెక్కీ చేశారు.
రోజంతా రెక్కీ చేసి.. రాత్రి దోపిడీ
డిసెంబర్ 1న మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్‌కుమార్, తన అసిస్టెంట్ సుఖ్‌దేవ్‌తో కలిసి 3కిలోల రెడీమేడ్ గోల్డ్ ఆర్నమెంట్స్‌తో బయలుదేరాడు. బోడుప్పల్‌లోని నవరతన్ జ్యూవెలర్స్, ఫీర్జాదిగూడ కమాన్‌లోని రాజలక్ష్మీ జ్యూవెలర్స్, వనస్థలిపురం సుష్మా థియేటర్ దగ్గర్లోని భవానీ, గజేంద్ర జ్యూవెలర్స్‌లో మొత్తం 135 గ్రాముల ఆభరణాలు సేల్ చేశారు. వీటికి సంబంధించిన రూ.2.63 లక్షలు కలెక్షన్ చేసుకున్నారు. రాత్రి 8గంటలకు నాగోల్ స్నేహపురి కాలనీలోని మహదేవ్ జ్యూవెలర్స్‌కు వచ్చారు. షాప్ ఓనర్ కళ్యాణ్ చౌదరీకి జ్యూవెలరీని చూపించారు. అదే టైంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల షాప్‌లోకి చొరబడి షెట్టర్ క్లోజ్ చేశారు. పిస్టల్స్‌తో కాల్పులు జరిపి సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.63 లక్షల క్యాష్‌తో పారిపోయారు. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు 15 టీమ్స్‌తో దర్యాప్తు చేశారు.