
బషీర్ బాగ్, వెలుగు: గంగ పుత్రులు ఏటా నిర్వహించే గంగ తెప్పోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి గంగపుత్ర, బెస్త, గూండ్ల కులస్తులు ఈ వేడుకలో పాల్గొనడంతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిశాయి. ఖైరతాబాద్ ఏడుగుళ్ల దేవాలయం నుంచి పీవీ నరసింహారావు మార్గం చౌరస్తాలోని గంగమ్మ దేవాలయం వరకు వందలాది మంది గంగపుత్ర మహిళలు బోనాలు ఎత్తుకోగా గంగ తెప్పతో భారీ ఊరేగింపు జరిగింది.
ఇందులో ఒగ్గు డోలు, కోలాటం, బ్యాండు మేళాలు, యువతీ యువకుల విన్యాసాలు, డాన్సుల మధ్య కోలాహలంగా ఉత్సవం జరిగింది. గంగమ్మకు ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ అనంతరం ఐమాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ ఖాళీ స్థలం వద్ద గంగపుత్ర, బెస్త, గూండ్ల కులస్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఊరేగింపును రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో తెప్పోత్సవ కమిటీ అధ్యక్షుడు మలుకు మహేందర్ బాబు, ప్రధాన కార్యదర్శి పుసానరసింహ, నాయకులు జి. చందు, మెట్టు ధన్ రాజ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.