
అటాప్సీ రిపోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోస్ట్‌మార్టం రిపోర్టులో అతడి మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవడంతోపాటు షాక్ గురవడంతోనే దూబే చనిపోయాడని అటాప్సీ రిపోర్టుతో తెలిసింది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తుపాకీ గాయాలు కావడంతో అతడికి రక్తస్రావం అయిందని పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం తెలుస్తోంది. అతడి శరీరంపై పది చోట్ల గాయాలయ్యాయని, ఓ బుల్లెట్ దూబే కుడి భుజానికి, రెండు బుల్లెట్‌లు ఛాతీ ఎడమ వైపు చొచ్చుకుపోయాయని రిపోర్ట్‌లో వెల్లడైంది.
యూపీ పోలీసులు ఈ నెల 10న దూబేను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న సమయంలో కారు బోల్తా పడింది. ఇదే అదనుగా దూబే తప్పించుకునేందుకు యత్నించగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో అతడు చనిపోయాడు. పోస్ట్‌మార్టం రిపోర్టు వెల్లడి సమయంలో దూబే మృతిపై డాక్టర్లు పలు విషయాలు వెల్లడించారు. తమ నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసిన దూబేపై పోలీసులు ఫైరింగ్ చేశారని, అందులో నాలుగు బుల్లెట్లు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయని చెప్పారు.