ఒడిషాలో షాకింగ్ ఘటన: ప్రభుత్వ హాస్టల్లో ఇద్దరు 10 టెన్త్ క్లాస్ అమ్మాయిలు ప్రెగ్నెంట్

ఒడిషాలో షాకింగ్ ఘటన: ప్రభుత్వ హాస్టల్లో ఇద్దరు 10 టెన్త్ క్లాస్ అమ్మాయిలు ప్రెగ్నెంట్

భువనేశ్వర్: ఒడిషాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ హాస్టల్లో ఉంటోన్న ఇద్దరు 10వ తరగతి బాలికలు గర్భం దాల్చారు. హాస్టల్లో నిర్వహించే సాధారణ వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. వసతి గృహ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిషాలోని కంధమాల్‌ జిల్లా తుముడిబంద్ బ్లాక్‌లో ఉన్న రెండు ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు ప్రెగ్నెంట్ అయ్యారని తెలిపారు.

ALSO READ | మొన్న బెంగళూరు, ఇప్పుడు కోల్కతా.. దీదీ ఇలాకాలో ఊపందుకున్న మరో భాషోద్యమం !

 

సదరు బాలికలు వేసవి సెలవుల తర్వాత హాస్టల్‎కి రాగా.. వారి ప్రవర్తనపై హాస్టల్ సిబ్బందికి అనుమానం కలిగింది. ప్రతి నెల హాస్టల్ సిబ్బంది పంపిణీ చేసే శానిటరీ న్యాప్‌కిన్‌లను సదరు బాలికలు తీసుకోవడం లేదు. దీంతో అనుమానం వచ్చి ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఇద్దరు బాలికలకు గర్భం నిర్ధారణ అయ్యిందని తెలిపారు. హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఈ ఘటనలపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనతో ప్రభుత్వ వసతి గృహల్లో మైనర్ బాలికల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి. హస్టల్లో మైనర్ బాలికల గర్భం విషయం తెలియడంతో ఇతర విద్యార్థినుల తల్లిదండ్రులకు ఆందోళనకు గురయ్యారు. నిందితులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఒడిషాలోని బీజేపీ ప్రభుత్వంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించాయి.