మొన్న బెంగళూరు, ఇప్పుడు కోల్కతా.. దీదీ ఇలాకాలో ఊపందుకున్న మరో భాషోద్యమం !

మొన్న బెంగళూరు, ఇప్పుడు కోల్కతా.. దీదీ ఇలాకాలో ఊపందుకున్న మరో భాషోద్యమం !

తమిళనాడు, కర్ణాటకలో మొదలైన భాషోద్యమం.. మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. హిందీ పెత్తనాన్ని సహించేది లేదని.. స్థానిక భాషలను కాపాడుకుంటామని ఆ రాష్ట్రాలు చేసిన ఉద్యమాలు.. ఆ తర్వాత మహారాష్ట్రకు పాకాయి. లేటెస్ట్ గా వెస్ట్ బెంగాల్ లో కూడా మరో భాషోద్యమం పురుడు పోసుకుంటోంది. షాపులు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలు.. ఇలా అన్ని రకాల కమర్షియల్ కాంప్లెక్స్ లలో బెంగాలీ భాష తప్పనిసరిగా ఉండాలని కోల్ కతా మేయర్ ఆర్డర్ ఇవ్వడంతో దీదీ ప్రారంభించిన భాషోద్యమం తీవ్రరూపం దాల్చనుందనే చర్చ నడుస్తోంది. 

కోల్ కతా నగరంలో అన్ని బోర్డులు, హోర్డింగులు బెంగాలీలో ఉండాల్సిందేనని శుక్రవారం (జులై 25) కోల్ కతా సిటీ మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఉత్తర్వులు జారీ చేశారు. టాక్ విత్ మేయర్.. సెషన్ నిర్వహించిన తర్వాత ఈ ఆర్డర్స్ పాస్ చేశారు. బెంగాలీ భాషలో పేర్లు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని బోర్డులు, హోర్డింగులు హిందీ, ఇంగ్లీషు, ఇతర భాషల్లో ఉంటున్నాయి. కానీ బెంగాలీ మాత్రం కనిపించడం లేదు. ఇకపై ఇతర భాషలతో పాటు బెంగాలీ కూడా ఉండాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు మేయర్. అయితే పేర్లు ఇతర భాషల్లో ఉన్నా పర్వాలేదని.. కానీ బెంగాల్ లో కూడా కచ్చితంగా రాయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ALSO READ | నిరసనలు లేకుండా లోక్‌‌సభ..అఖిలపక్ష భేటీలో కుదిరిన ఏకాభ్రిపాయం

కోల్ కతాలో బెంగాలీ బోర్డులు ఉండాలనే నిబంధన తీసుకొచ్చి లాస్ట్ ఇయరే మేయర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025, ఫిబ్రవరి 21 వరకు అన్ని కమర్షియల్ ప్లేస్ లలో బెంగాలీ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు బెంగాలీ భాషా ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు గత వారం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. భాషా రూపంలో బెంగాల్ పై ఆధిపత్యం కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించిన ఆమె.. ఇక నుంచి పెద్ద ఎత్తున భాషోద్యమం చేపడతామని ప్రకటించారు. దీంతో శుక్రవారం (జులై 25) జరిగిన నగరపాలక సంస్థ సమావేశంలో అన్ని ఉత్తర్వులు బెంగాలీలోనే ప్రచురించారు. 

49 వార్డు సభ్యురాలు ప్రశ్నను ఇంగ్లీష్ లో అడగగా ప్రొసీడింగ్స్ బెంగాలీలోనే జరపాలని సూచించడంతో బెంగాలీలో ప్రశ్నను పంపారు. దీన్ని బట్టే అర్థం అవుతోంది బెంగాల్ లో భాషోద్యమం ఏ స్థాయిలో ఊపందుకుంటుందో. మాతృ భాషలో మాట్లాడుకోవడానికి, పాలన అందించడానికి మనం ఎందుకు మొహమాట పడాలని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఛైర్ పర్సన్ మాలా రాయ్ అన్నారు. 

ఏదైతేనేం.. హిందీ భాషా పెత్తనం వద్దనే ఉద్యమం తమిళనాడు, కర్ణాటక దాటి మహారాష్ట్ర మీదుగా ఇప్పుడు బెంగాల్ చేరుకుంది. మాతృభాషలో కల్చర్ దాగి ఉందని.. ఇతర భాషల పెత్తనం వలన స్థానిక సంస్కృతిని కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. అందుకోసం బెంగాల్ లో బలమైన భాషోద్యమం తీసుకొస్తున్నట్లు సీఎం మమతాబెనర్జీ ఇటీవలే ప్రకటించారు.