ఇరాన్‎లో ఉగ్రదాడి.. కోర్టు భవనంపై ఎటాక్ చేసిన టెర్రరిస్టులు.. 8 మంది మృతి

ఇరాన్‎లో ఉగ్రదాడి.. కోర్టు భవనంపై ఎటాక్ చేసిన టెర్రరిస్టులు.. 8 మంది మృతి

టెహ్రాన్: ముస్లిం కంట్రీ ఇరాన్‎లో ఉగ్రదాడి జరిగింది. ఆగ్నేయ సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్‌ రాజధాని జహెదాన్‌లోని కోర్టు భవనంపై శనివారం (జూలై 26) ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. టెర్రర్ ఎటాక్‎లో ఐదుగురు సామాన్య పౌరులు, ముగ్గురు ఉగ్రవాదులు సహా మొత్తం 8 మంది చనిపోయినట్లు ఇరాన్ రాష్ట్ర మీడియా ధ్రువీకరించింది. 13 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ దాడికి సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిందని స్థానిక మీడియా తెలిపింది. 

ALSO READ | థాయిలాండ్, కంబోడియా వార్ దేని గురించి ? ఎవరికీ నష్టం, అక్కడి పరిస్థితి ఏంటంటే..

సెంట్రల్ జహెదాన్‌లోని కోర్టు సముదాయంలోని న్యాయమూర్తుల గదుల్లోకి ముష్కరులు చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరపారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. ఈ దాడిలో13 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారని తెలిపింది. దాడి సమయంలో కోర్టు భవనం చుట్టూ భారీగా కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇది ఆత్మహుతి దాడి అయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా దళాలు ఘటన స్థలంలో ముగ్గురు ముష్కరులను కాల్చి పడేశారని అధికారులు వెల్లడించారు. ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ జాతీయ భద్రతను అస్థిరపరిచేందుకు జరిగిన ఉగ్రవాద చర్యగా ఈ దాడిని అభివర్ణించింది. ఈ దాడిపై  దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.

కాగా, ఇరాన్ సరిహద్దులో ఉన్న సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ చాలా కాలంగా జాతి, మత, రాజకీయ కొట్లాటలతో అల్లకల్లోలంగా ఉంది. ఈ ప్రాంతం ప్రధానంగా సున్నీ ముస్లిం బలూచ్ మైనారిటీలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతం ఉనికి, గుర్తింపు కోసం జైష్ అల్-అద్ల్ సంస్థ పోరాటం చేస్తోంది. ఇరాన్‌లోని సున్నీ మైనారిటీల హక్కులు కాపాడటమే తమ లక్ష్యమని ప్రకటించింది. జైష్ అల్-అద్ల్‎ను ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.  జైష్ అల్-అద్ల్ గతంలో ఇరాన్ భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడింది. విదేశీ శక్తులతో చేతులు కలిపి డ్రగ్స్ అక్రమ రవాణా, సరిహద్దు ఉగ్రవాదంలో జైష్ అల్-అద్ల్ పాల్గొంటుందని టెహ్రాన్ ఆరోపించింది.