వీఆర్ఏలకు అపాయింట్​మెంట్​ లెటర్లు: గంగుల

వీఆర్ఏలకు అపాయింట్​మెంట్​ లెటర్లు:  గంగుల
  • నిన్నటిదాకా అరేయ్​ ఒరేయ్​ అన్నోళ్లే ఇక సార్ అంటరు

కరీంనగర్​​, వెలుగు :  ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వీఆర్ఏలు గురువారం అపాయింట్​మెంట్​ లెటర్లు అందుకున్నారు. వీఆర్ఏలను రెగ్యులరైజ్​ చేసిన సర్కారు.. వారి కోసం వివిధ శాఖల్లో మొత్తం 14,954 సూపర్ న్యూమరరీ​ పోస్టులను క్రియేట్​ చేసిన విషయం తెలిసిందే. దీంతో రెవెన్యూలో 2,451 మంది  జూనియర్​ అసిస్టెంట్లుగా, 2,113 మంది రికార్డ్​ అసిస్టెంట్లుగా, 679 మంది ఆఫీస్​ సబార్డినేట్లుగా, పురపాలక శాఖలో1,266  మంది వార్డు ఆఫీసర్లుగా, ఇరిగేషన్  శాఖలో 5,063 మంది లష్కర్లు, హెల్పర్లుగా, మిషన్ భగీరథ శాఖలో  3,372  మంది హెల్పర్లుగా మారిపోయారు. వారిలో పలువురికి గురువారం ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నియామక పత్రాలు అందజేశారు. 

కరీంనగర్ కలెక్టరేట్ లో గురువారం జరిగిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్​ పాల్గొని  442 మంది వీఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, లష్కర్లుగా అపాయింట్ మెంట్  లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ  రాక ముందు వీఆర్ఏలను గ్రామాల్లో చాలా చులకనగా చూసేవారని, ఇప్పుడు వారి ఆత్మగౌరవం పెంచేలా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇన్నాళ్లూ  అరేయ్.. ఒరేయ్ అని పిలిచినోళ్లే ఇకపై సార్ అని పిలుస్తారని చెప్పారు.