రోహిత్‌‌ కెప్టెన్సీపై నమ్మకముంది

రోహిత్‌‌ కెప్టెన్సీపై నమ్మకముంది
  • వైట్‌‌బాల్‌ కు ఇద్దరు కెప్టెన్లు అనవసరం
  • అందుకే వన్డే పగ్గాలు రోహిత్‌‌కు ఇవ్వాల్సి వచ్చింది
  • విరాట్‌‌తో చీఫ్​ సెలక్టర్​, నేను స్వయంగా మాట్లాడినం.. తను ఒప్పుకున్నడు: గంగూలీ

ముంబై:  లిమిటెడ్‌‌ ఓవర్ల ఫార్మాట్‌‌కు టీమిండియా కెప్టెన్‌‌గా రోహిత్‌‌ శర్మను నియమించడమనేది బోర్డు, సెలక్షన్‌‌ కమిటీ కలిసి తీసుకున్న నిర్ణయమని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ అన్నాడు. తాము వద్దన్నా సరే విరాట్‌‌టీ20 కెప్టెన్సీ వదులుకోవడం వల్లే ఇలా జరిగిందని స్పష్టం చేశాడు.  వైట్‌‌బాల్‌‌ ఫార్మాట్‌‌కు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని, అందుకే వన్డే పగ్గాలు కూడా రోహిత్‌‌కు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. వన్డే, టీ20 కెప్టెన్‌‌గా జట్టు కోసం విరాట్‌‌ ఎంతో చేశాడని ఈ సందర్భంగా కొనియాడాడు. టీమిండియా వన్డే కెప్టెన్‌‌గా విరాట్‌‌ను తప్పించిన సెలక్టర్లు రోహిత్‌‌ను కొత్త కెప్టెన్‌‌గా ప్రకటించడంపై గంగూలీ గురువారం స్పందించాడు. ఈ విషయంలో బోర్డుపై  వస్తున్న విమర్శలకు బదులిచ్చాడు. కెప్టెన్సీ మార్పుపై కోహ్లీతో మాట్లాడామని, తను ఒప్పుకున్నాకే నిర్ణయం వచ్చిందని వెల్లడించాడు. 

టీ20 కెప్టెన్‌‌గా ఉండాలని రిక్వెస్ట్‌‌ చేసినం
టీ20 వరల్డ్‌‌కప్‌‌ తర్వాత షార్ట్‌‌ఫార్మాట్‌‌ కెప్టెన్‌‌గా దిగిపోతానని కోహ్లీ ముందే ప్రకటించాడు. వద్దని తాము రిక్వెస్ట్ చేసినా వినలేదని గంగూలీ చెప్పాడు. ‘విరాట్‌‌ ప్లేస్‌‌లో  రోహిత్‌‌కు కెప్టెన్సీ ఇవ్వడమనేది బోర్డు, సెలెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయం. నిజానికి టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్‌‌ను మేము చాలా రిక్వెస్ట్‌‌ చేశాం. కానీ కోహ్లీ మా మాటకు ఒప్పుకోలేదు. దాంతో  వైట్‌‌ బాల్‌‌ ఫార్మాట్స్‌‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండటం కరెక్ట్‌‌ కాదని సెలక్టర్లు భావించారు. వన్డే, టీ20లకు వేర్వేరు లీడర్లు ఉండటం కన్ఫ్యూజన్‌‌కు దారి తీస్తుందనుకున్నారు.  అందుకే ఒకే కెప్టెన్‌‌ ఉంటే మంచిదని... రోహిత్‌‌ను కెప్టెన్‌‌ చేశారు.  టెస్ట్‌‌ జట్టుకు విరాట్‌‌ కెప్టెన్‌‌గా కొనసాగుతాడు. ఈ విషయాలపై బోర్డు ప్రెసిడెంట్‌‌గా నేను, సెలక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌ కూడా కోహ్లీతో పర్సనల్‌‌గా మాట్లాడాం. పూర్తి వివరాలు చెప్పలేను గానీ రోహిత్‌‌ను వైట్‌‌బాల్‌‌ కెప్టెన్‌‌ చేయడానికి ప్రధాన కారణం మాత్రం ఇదే. అందుకు విరాట్‌‌ కూడా ఒప్పుకున్నాడు. ఇండియన్‌‌ క్రికెట్‌‌ సరైన వ్యక్తుల చేతుల్లోనే ఉందని బీసీసీఐ భావిస్తోంది. వైట్‌‌ బాల్‌‌ ఫార్మాట్స్‌‌లో కెప్టెన్‌‌గా విరాట్‌‌ అందించిన సేవలకు థ్యాంక్స్‌‌ చెబుతున్నాం’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

రోహిత్‌‌ కెప్టెన్సీపై నమ్మకముంది
వైట్‌‌బాల్‌‌ కెప్టెన్‌‌గా రోహిత్‌‌ సత్తా పై తమకు నమ్మకముందని గంగూలీ అన్నాడు. ‘వన్డే కెప్టెన్‌‌గా రోహిత్‌‌ ఎలా పెర్ఫామ్‌‌ చేస్తాడో ఇప్పుడే ఊహించడం కష్టం. తనకు ఆల్‌‌ది బెస్ట్‌‌ చెబుతున్నా. తను బాగా రాణిస్తాడని అనుకుంటున్నా. వన్డే కెప్టెన్‌‌గా  కోహ్లీ70 శాతం సక్సెస్‌‌ సాధించాడని తెలుసు. అయితే, ఇప్పటిదాకా ఈ ఫార్మాట్‌‌లో ఇండియా కెప్టెన్‌‌గా చేసినప్పుడు రోహిత్‌‌ రికార్డు కూడా బాగానే ఉంది. ఏదేమైనా వైట్‌‌బాల్‌‌ ఫార్మాట్‌‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదు’ అని దాదా స్పష్టం చేశాడు. 

వైస్‌‌ కెప్టెన్‌‌గా రాహుల్‌‌!
ఇండియా వన్డే టీమ్​ వైస్​ కెప్టెన్​గా కేఎల్‌‌ రాహుల్‌‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే చాన్స్‌‌ ఉంది. ‘కెప్టెన్‌‌, వైస్‌‌ కెప్టెన్‌‌ మధ్య బ్యాలెన్స్‌‌ను మెయింటేన్‌‌ చేయడం చాలా ఇంపార్టెంట్‌‌. సెలక్టర్లు భారీ మార్పులు కోరుకోవడం లేదు. ఓ యంగ్‌‌స్టర్‌‌కు వైస్‌‌ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. టీమ్‌‌ ఫ్యూచర్‌‌పై సెలక్టర్లు ఎక్కువ ఫోకస్​ పెట్టారు. పంత్‌‌ కూడా రేసులో ఉన్నప్పటికీ రాహుల్‌‌ ఫ్రంట్‌‌ రన్నర్‌‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే టీ20ల్లో రోహిత్‌‌కు తను డిప్యూటీగా పని చేస్తున్నాడు. కాబట్టి అతనికే దక్కే చాన్సెస్‌‌ ఎక్కువగా ఉన్నాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. 

బ్యాటర్‌‌, లీడర్‌‌గా టీమ్‌‌కు కోహ్లీ కావాలి: రోహిత్‌‌
బ్యాటర్‌‌గా విరాట్‌‌ కోహ్లీ సామర్థ్యం, లీడర్‌‌షిప్‌‌ స్కిల్స్‌‌.. టీమిండియాకు చాలా అవసరమని వైట్‌‌బాల్‌‌ ఫార్మాట్‌‌ కొత్త కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ అన్నాడు. అందుకే అతను టీమ్‌‌లో ఉండాలని కోరుకుంటానన్నాడు. ‘ఓ బ్యాటర్‌‌గా కోహ్లీ క్వాలిటీ, స్కిల్స్‌‌ టీమ్‌‌కు ఎప్పుడూ అవసరమే. టీ20 ఫార్మాట్‌‌లో అతని యావరేజ్‌‌ 50 ప్లస్‌‌ ఉండటం చాలా గొప్ప విషయం. తన అనుభవంతో కష్టకాలంలో చాలాసార్లు టీమ్‌‌ను గెలిపించాడు. ఇక నా వరకు కెప్టెన్‌‌గా సరైన టీమ్‌‌ను, కాంబినేషన్‌‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. తర్వాత కొన్ని ట్యాక్టికల్‌‌ అంశాలపై దృష్టిపెడితే సరిపోతుంది. పెర్ఫామెన్స్‌‌ పరంగా కెప్టెన్‌‌ ఎప్పుడూ ముందుండాలి. అదే టైమ్‌‌లో ప్లేయర్లకు అవసరమైనప్పుడు మద్దతుగానూ నిలవాలి. ప్రతి ప్లేయర్‌‌ను టీమ్‌‌లో ముఖ్యమైన మెంబర్‌‌గా ఉండేలా చూడాలి’ అని రోహిత్‌‌ వ్యాఖ్యానించాడు. 

ఫీల్డ్‌‌లో కెప్టెన్‌‌ పని 20 శాతమే
ఫీల్డ్‌‌లో కెప్టెన్‌‌ పని 20 శాతం వరకే ఉంటుందని, మిగతాదంతా ప్లానింగ్‌‌పైనే డిపెండ్‌‌ అయ్యి ఉంటుందని ముంబైకర్‌‌ అన్నాడు. ‘నా రోల్‌‌ ఎక్కువగా ఔట్‌‌సైడ్‌‌లోనే ఉంటుంది. ప్లేయర్లకు బాధ్యతలు అప్పగించడం, వాళ్ల నుంచి అనుకున్న టార్గెట్స్‌‌ను రాబట్టడం. ఇది ఫీల్డ్‌‌లోనే జరుగుతుంది. మనం ఫీల్డ్‌‌లోకి దిగినప్పుడు మూడు గంటలే టైమ్‌‌ ఉంటుంది. ఈ టైమ్‌‌లోనే 11 మంది ప్లేయర్లను చూసుకుంటూనే మ్యాచ్‌‌ను ఛేంజ్‌‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్‌‌ఫీల్డ్‌‌లో మనకు ఎక్కువగా చాన్స్‌‌ దొరకదు. అదే బయటైతే స్ట్రాటజీని, బెటర్‌‌ కాంబినేషన్‌‌ తీసుకోవడం వంటి చాలా అంశాలను చూసుకోవచ్చు’ అని రోహిత్‌‌ వెల్లడించాడు.