గాంధీలో గుప్పుమంటున్న గంజాయి.. ఆందోళనలో పేషెంట్లు

గాంధీలో గుప్పుమంటున్న గంజాయి.. ఆందోళనలో పేషెంట్లు
  • తనిఖీల్లో పేషెంట్అటెండెంట్ల వద్ద పట్టివేత
  • ఆందోళనలో పేషెంట్లు

పద్మారావునగర్, వెలుగు: పేదోడి ప్రముఖ ఆస్పత్రిగా పేరున్న గాంధీలో గంజాయి గుప్పుమంటోంది. సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో గత 3 రోజుల్లో ప్రతిరోజు గంజాయి పట్టుబడటం కలకలం రేపుతోంది. దీంతోపాటు హుక్కా, ఓ కత్తి కూడా దొరికింది. వివిధ అనారోగ్య సమస్యలతో రాష్ట్రంలోని నలుమూలాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు గాంధీ ఆసుపత్రికి భారీ సంఖ్యలో వస్తుంటారు. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే గాంధీ పరిసరాల్లో గతంలో పలుసార్లు అవాంఛీనయ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. గతంలో కేవలం 101 మంది మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది ఉండటంతో వ్యక్తిగత తనిఖీలు చేయడంతో పాటు భద్రత చర్యలు చేపట్టడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం 190 మంది సెక్యూరిటీ డ్యూటీలు చేస్తున్నారు. ఆసుపత్రిలో మత్తు పదార్దాలు, సిగరేట్లు, గుట్కాలను నిషేధిస్తూ ఇటీవల ఆసుపత్రి యంత్రాంగం నిర్ణయించగా.. మెయిన్​బిల్డింగ్, ఎమర్జెన్సీ బ్లాక్​ఎంట్రన్స్​ల వద్ద సెక్యూరిటీ తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా ప్రతి రోజూ తనిఖీల్లో గుట్కాలు, సిగరేట్లు, తెల్ల కల్లు, విస్కీ సీసాలు లభ్యమవుతుండటం సాధారణంగా మారింది. వీటితోపాటు వరుసగా గంజాయి లభిస్తుండటం కలకలం రేపుతోంది. 

3 రోజుల్లో 3 ఘటనలు

తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇస్మాయిల్​అహ్మాద్(48) అనే వ్యక్తి దగ్గర గంజాయి, హుక్కా దొరికాయి. దాంతో సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. శనివారం తెల్లవారుజామున 3.30 సమయంలో ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బేగంబజార్​కు చెందిన చేతన్(23), జగదీశ్(19) అనే  ఇద్దరు యువకులను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని చెక్​చేయగా వారి వద్ద గంజాయి ప్యాకెట్లతో పాటు, వీపు వెనక  దాచుకున్న కత్తి లభించాయి. ఆ ఇద్దరు ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్లు సమాచారం. ఏదో ప్లాన్​ప్రకారమే గాంధీలోకి ఎంటర్​అయినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం జరిపిన చెకింగ్​లో సమీర్​కుమార్​సిన్హా(31) అనే వ్యక్తి వద్ద గంజాయి, హుక్కా దొరికాయి. వీరిని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. ఇలా వరసగా ప్రతి రోజు ఘటనలు జరగడం పేషంట్లలో ఆందోళన కలిగిస్తోంది. భద్రతను మరింత పెంచాలని పేషెంట్లు, వారి అటెండర్లు కోరుతున్నారు. పనిచేయని సీసీ కెమెరాల స్థానంలో కొత్తవి పెట్టి, నిఘాను మరింత పెంచాలంటున్నారు.