చాక్లెట్ల రూపంలో గంజాయి! ఖమ్మం రూరల్ మండలంలో విచ్చలవిడిగా వినియోగం

చాక్లెట్ల రూపంలో గంజాయి!  ఖమ్మం రూరల్ మండలంలో విచ్చలవిడిగా వినియోగం
  • వారం రోజుల్లో రెండు చోట్ల గంజాయి చాక్లెట్లు పట్టివేత
  • రూ.లక్షల విలువైన 7 కేజీల చాక్లెట్లు స్వాధీనం
  • ఒడిశా, ఏఓబీ నుంచి ట్రైన్లలో తెచ్చి ఇక్కడ అమ్మకం

ఖమ్మం, వెలుగు :  ఖమ్మంలో గంజాయి అమ్మకాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతున్నారు. ఖమ్మం రూరల్​ మండలం  వారం రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులే టార్గెట్ గా అమ్ముతున్న గంజాయి చాక్లెట్లు దొరికాయి. ఏప్రిల్ 23న ఖమ్మం రూరల్​ మండలం గుర్రాలపాడు సమీపంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక ఇంట్లో నిల్వ చేసిన 5.880 కిలోల చాక్లెట్లను ఎక్సైజ్​ సిబ్బంది పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన బానోత్ హరియా అనే వ్యక్తి సొంత రాష్ట్రం నుంచి ఇక్కడికి ట్రైన్​ లో చాక్లెట్లను తీసుకువచ్చి అమ్ముతున్నట్టు గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. 

రెండ్రోజుల కింద ఖమ్మం రూరల్​ మండలం ఆరెంపుల సమీపంలో ఉన్న ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న తిరుమలాయపాలెంకు చెందిన కొమ్ము ప్రభాకర్, యూపీకి చెందిన చోటాఖాన్​ను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 90 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. యూపీ, బీహార్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, ఒడిశా, చత్తీస్ గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం రూరల్​, ముదిగొండ మండలాల్లోని గ్రానైట్ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తుంటారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్​, ఒడిశాలో దొరికే గంజాయిని ఇలా చాక్లెట్ల రూపంలో మార్చి అక్కడ తక్కువ రేటుకు అమ్ముతుండగా, వాటిని ట్రైన్లలో ఇక్కడికి తెచ్చి కార్మికులకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టుగా గుర్తించారు. 

ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో అమ్మకం.. 

గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండు గంజాయి విపరీతంగా పట్టుబడేది. ఆంధ్రా,  ఒడిశా బోర్డర్​ నుంచి ఖమ్మం జిల్లా మీదుగా హైదరాబాద్​ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించే సమయంలో కార్లు, లారీల్లో తనిఖీ చేసి పట్టుకునేవారు. దీంతో రూటు మార్చి ఆర్టీసీ బస్సులు, ట్రైన్లలో ఇప్పుడు గంజాయి రవాణా చేస్తున్నట్టుగా గుర్తించి, ఇన్ఫర్మేషన్​ వచ్చిన సమయంలో అక్కడ కూడా తనిఖీలు చేసి పట్టుకుంటున్నారు. ఇక హ్యాష్​ ఆయిల్ రూపంలో తరలిస్తున్న గంజాయిని కూడా గతేడాది వైరా సమీపంలో పట్టుకున్నారు. రెండేళ్ల కింద ఒడిశా నుంచి కోణార్క్​ ఎక్స్​ ప్రెస్​ లో హైదరాబాద్​కు తరలిస్తున్న 4 కేజీల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్​ సిబ్బంది పట్టుకున్నారు. 

అయితే ఇటీవల వారం రోజుల్లోనే ఖమ్మం రూరల్​ మండలంలో రెండు ఘటనలు జరగడంతో పట్టుబడిన వాటి కంటే పది రెట్లు ఇక్కడ అమ్మకాలు జరుగుతుండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. కచ్చితమైన ఇన్ఫర్మేషన్​ ఉంటే తప్ప ఇలా ట్రైన్లలో తరచుగా సోదాలు చేసి గంజాయిని పట్టుకోవడం ఎక్సైజ్​, పోలీస్​ అధికారులకు కూడా తలకు మించిన భారంగా మారుతోంది. ఒకేసారి ఒడిశా నుంచి బల్క్​ గా ఈ గంజాయి చాక్లెట్లను తెప్పించి రూ.5 చొప్పున హోల్ సేల్ గా అమ్ముతున్నారని, వాటిని చిన్న బడ్డీ కొట్ల వ్యాపారులు కొని అవకాశాన్ని బట్టి రూ.20 నుంచి రూ.50 వరకు కార్మికులకు అమ్ముతున్నారని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు పట్టుబడ్డ వారు చిన్న వ్యాపారులు కాగా, అసలు సూత్రధారిగా భావిస్తున్న హోల్ సేల్ వ్యాపారి ఆచూకీ కోసం ఎక్సైజ్​, పోలీస్​ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

వలస కార్మికులే వాడుతున్నారు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఖమ్మం జిల్లాలో గ్రానైట్ కార్మికులుగా పనిచేస్తున్న వారే గంజాయి చాక్లెట్లను వాడుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో దీనిపై కార్మికులు మొగ్గుచూపుతున్నారు. గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు తరచుగా తనిఖీ చేస్తున్నాం. – నాగేంద్ర రెడ్డి, జిల్లా ఎక్సైజ్​ అధికారి, ఖమ్మం