ఫస్ట్​ గంజాయి.. ఆపై ​​డ్రగ్స్

ఫస్ట్​ గంజాయి.. ఆపై ​​డ్రగ్స్

గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠా 
తరచూ హైదరాబాద్ తీసుకెళ్లి అఘాయిత్యాలు
జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
చల్​గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు  
నెల కిందనే ఫిర్యాదు అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ 

కరీంనగర్/జగిత్యాల:  జగిత్యాలలో స్కూల్ పిల్లలకు గంజాయి అలవాటు చేసి, సెక్స్ ​రాకెట్​నడుపుతున్న ముఠా వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలను టార్గెట్ చేసిన ఈ ముఠా.. వాళ్లకు గంజాయి చాక్లెట్లు ఇచ్చి, క్రమంగా మత్తుకు బానిసలయ్యేలా చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత డ్రగ్స్​కు కూడా అలవాటు చేసి హైదరాబాద్​లో జరిగే పార్టీలకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ ముఠా వలలో చిక్కుకున్న ఓ బాలిక దుస్థితి తాజాగా వెలుగులోకి రాగా.. మరికొందరు బాధితుల తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించి, వారి పిల్లలను డీఅడిక్షన్ సెంటర్లలో ట్రీట్​మెంట్​కు తీసుకెళ్తున్నారు. ఈ వ్యవహారాన్ని  బాధిత బాలిక తండ్రి నెల రోజుల క్రితమే అప్పటి జగిత్యాల సీఐ దృష్టికి తీసుకెళ్లినా... ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, విచారణ చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లోనే ఈ విషయమై కూపీ లాగితే గంజాయి ముఠా దందా వెలుగులోకి వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

రూ.20కి గంజాయి చాక్లెట్లు.. 

గంజాయికి బానిసై ప్రస్తుతం కరీంనగర్ స్వధార్ హోంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బాధిత బాలికను అధికారులు విచారించగా, ఆమె పలు విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. జగిత్యాల రూరల్ మండలం చల్​గల్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని.. రూ.20, రూ.30కి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నదని చెప్పినట్టు సమాచారం. 9వ తరగతిలో ఉన్నప్పుడే ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా తనకు గంజాయి అలవాటైందని.. ఆ తర్వాత గంజాయి తాగే బాయ్స్ తో పరిచయమైందని ఆమె చెప్పింది. 10 మంది కలిసి ‘లవ్లీ ఫ్రెండ్స్’ అనే వాట్సాప్ గ్రూప్​లో ఎక్కడ కలుసుకోవాలి? ఎక్కడికి వెళ్లాలనే విషయాలపై మాట్లాడుకునేవారని తెలిసింది. అమ్మాయిలు గంజాయికి పూర్తిగా అడిక్ట్ అయ్యాక.. ఆ ముఠా వాళ్లు వారిని తరచూ హైదరాబాద్​కు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడేవారని బాధితురాలు చెప్పినట్టు సమాచారం. గంజాయికి అలవాటుపడ్డ బాలికల ప్రవర్తన బాగోలేదని, వాళ్ల కారణంగా మిగతావాళ్లు డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో.. బాధిత బాలిక చదివిన గవర్నమెంట్ హైస్కూల్​లో ఆమెతో పాటు మరో ఆరుగురికి టీసీలు ఇచ్చినట్టు తెలిసింది. 

మొదటి నుంచీ పోలీసుల నిర్లక్ష్యం.. 

తన కూతురు గంజాయి, డ్రగ్స్​కు అడిక్ట్ కావడంతో కొందరు లైంగికంగా వేధింపులకు గురి చేశారని బాధితురాలి తండ్రి జగిత్యాల పోలీస్​ స్టేషన్​లో నెల రోజుల కింద ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అప్పటి సీఐ.. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును చించివేసినట్టు తెలిసింది. బాలికను కొందరు వేధింపులకు గురిచేసినట్టుగా వేరే ఫిర్యాదు రాయించినట్టు సమాచారం. అప్పట్లో ఇద్దరు, ముగ్గురిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీ కూడా ఈ బాలిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. ఆ బాలికను పోలీసులు అప్పట్లో కరీంనగర్ లోని స్వధార్ హోమ్ కు తరలించగా, ఆమె ఇప్పుడు అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నది. 

ఇంకా కోలుకోని బాలిక.. 

గంజాయి, డ్రగ్స్​కు అలవాటుపడడంతో బాధిత బాలిక మానసికంగా డిస్టర్బ్ అయినట్టు తెలిసింది. ఆమె పూర్తిగా రికవరీ అయ్యేందుకు దాదాపు ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మెడిసిన్, కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్​మెంట్ ఇస్తున్నారు. గంజాయి సప్లై చేసే ముఠాతో పాటు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులపై  కేసు నమోదు చేయాలని, ఈ ఉచ్చులో చిక్కుకున్న బాలికలను రక్షించాలని పేరెంట్స్ కోరుతున్నారు.

పోలీస్ శాఖలో కలకలం.. 

వీ6 వెలుగు పేపర్​లో ‘రేవ్ పార్టీలకు మైనర్లు’ హెడ్డింగ్​తో శుక్రవారం పబ్లిష్ అయిన స్టోరీ పోలీస్ శాఖలో కలకలం రేపింది. దీంతో సివిల్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. బాలికలను హైదరాబాద్​కు ఎవరు తీసుకెళ్లారు? ఎంత మంది వెళ్లేవారు? ఈ ముఠా వెనుక ఉన్న వ్యక్తులెవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. బాధితురాలి ఫోన్, కాల్ హిస్టరీ ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం బాధితురాలి తండ్రి నుంచి వివరాలు సేకరించారు. స్వధార్ హోంలో ఉన్న బాధితురాలి దగ్గరికి పోలీసులు వెళ్లకపోవడం గమనార్హం.