పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి చోరీ

పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి చోరీ

తెలంగాణలో గంజాయి స్మగ్లింగ్  అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి.. పలు ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకే షాకిచ్చారు కొందరు దొంగలు. ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే గంజాయిని కొట్టేశారు. సీజీ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచిన 70 కిలోల గంజాయిని చోరీ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్ కు చెందిన అంబులెన్సులో అక్రమంగా తరలిస్తున్న 70 కిలోల గంజాయిని సారంగపూర్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే, స్వాధీనం చేసుకున్న గంజాయిని అదే అంబులెన్స్ లో ఉంచి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్వార్టర్స్ పక్కన పార్కు చేశారు. నిన్న అంబులెన్స్ ను గమనించిన పోలీసులు..గంజాయి చోరీ అయిందని గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు డాగ్ స్క్వాడ్, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా  ముమ్మరంగా  తనిఖీలు చేపడుతున్నారు.