చాక్లెట్లలో గంజాయి.. స్కూల్ వద్ద కిరాణ షాపులో విక్రయం

చాక్లెట్లలో  గంజాయి.. స్కూల్ వద్ద కిరాణ షాపులో విక్రయం
  • స్టూడెంట్లను బానిసలుగా మార్చిన ఒడిశా ముఠా 
  • మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన 
  • హైదరాబాద్​ శివారు కొత్తూరులో బయటపడ్డ దందా
  • ముగ్గురి అరెస్టు.. 8 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం 

హైదరాబాద్‌‌‌‌/శంషాబాద్, వెలుగు: స్కూల్‌‌‌‌ స్టూడెంట్స్ టార్గెట్‌‌‌‌గా గంజాయి చాక్లెట్ల దందా చేస్తున్న ఒడిశా గ్యాంగ్‌‌‌‌ ను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్కూల్ సమీపంలోని కిరాణ షాపులో, మరికొన్ని చోట్ల గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గురిని శంషాబాద్‌‌‌‌ ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 8 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం వెల్లడించారు. ఒడిశాలోని జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బెహ్రా(33) గతేడాది హైదరాబాద్ వచ్చాడు. 

శంషాబాద్‌‌‌‌ సమీపంలోని కొత్తూరులో ఉంటున్నాడు. ఇక్కడి పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు సమీపంలోని నాట్‌‌‌‌కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. ఒడిశాకు చెందిన మరో ఇద్దరు సోమంత్‌‌‌‌ బెహ్రా(33), సూర్యమణి సాహూ(35) కూలీ పని చేస్తున్నారు. ఈ ముగ్గురూ కలిసి గంజాయి చాక్లెట్స్‌‌‌‌ అమ్మేందుకు ప్లాన్ చేశాAరు. ఒడిశాలో తయారయ్యే చాక్లెట్స్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌ కు తీసుకొచ్చి సప్లయ్ చేస్తున్నారు. ‘చార్మినార్ గోల్డ్’ పేరుతో ఉన్న గంజాయి చాక్లెట్లను ధీరేంద్ర తన షాపులో ఉంచి, విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. అలాగే మిగతా ఇద్దరూ ఇక్కడి ఇండస్ట్రీలలో పని చేసే కూలీలకు అమ్ముతున్నారు.  

ఇలా బయటపడింది..

కొత్తూరులోని నాట్‌‌‌‌కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థుల ప్రవర్తనలో గత రెండు నెలలుగా మార్పులు వచ్చాయి. స్కూల్ లో ప్రార్థన చేస్తున్న సమయంలో కొంతమంది కళ్లు తిరిగి పడిపోవడం, క్లాస్ రూమ్‌‌‌‌లో నిద్రపోవడం చేస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు స్కూల్‌‌‌‌ గేట్ వద్దే మల విసర్జన చేస్తున్నారు. ఇది గమనించిన హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌ అంగోర్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌ కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో ఓ విద్యార్ధి వద్ద చాక్లెట్స్‌‌‌‌ గుర్తించారు. అవి గంజాయి చాక్లెట్స్‌‌‌‌ అని తెలుసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్‌‌‌‌ ఎస్‌‌‌‌ఓటీ డీసీపీ రషీద్‌‌‌‌ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు. ధీరేంద్ర బెహ్రా షాపులో ఓ విద్యార్థితో చాక్లెట్ కొనుగోలు చేయించారు. షాపుపై దాడి చేసి ధీరేంద్ర బెహ్రాను అదుపులోకి తీసుకున్నారు. 8 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ధీరేంద్ర బెహ్రాకు సహకరించిన సోమంత్‌‌‌‌, సాహూను అరెస్ట్ చేశారు.

మొదట్లో ఫ్రీగా ఇచ్చి..

ధీరేంద్ర బెహ్రా కిరాణ షాపుకు సమీపంలోనే కొత్తూరు హైస్కూల్‌‌‌‌ ఉంది. ఆ స్కూల్ విద్యార్థులకు మొదట్లో గంజాయి చాక్లెట్స్‌‌‌‌ను ధీరేంద్ర ఫ్రీగా ఇచ్చాడు. అలా విద్యార్థులను ఆ చాక్లెట్లకు బానిసలుగా చేశాడు. ఆ తర్వాత ఒక్కో చాక్లెట్‌‌‌‌ను రూ.20 నుంచి రూ.30కి అమ్మడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సోమంత్‌‌‌‌, సాహూల సహకారంతో కొత్తూరులోని మరికొన్ని షాపులకు గంజాయి చాక్లెట్స్‌‌‌‌ను సప్లయ్ చేస్తున్నాడు. వీళ్లు ముగ్గురూ కలిసి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒడిశా నుంచి పెద్ద ఎత్తున చాక్లెట్స్‌‌‌‌ తీసుకొస్తున్నారు. ఇక్కడి ఇండస్ట్రీలలో పనిచేసే కూలీలకు ఒక్కో చాక్లెట్‌‌‌‌ను రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు.