రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నిస్తా: మాజీ ఎమ్మెల్యే గంటా

రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నిస్తా: మాజీ ఎమ్మెల్యే గంటా

ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు...తన  రాజీనామా ఆమోదంపై స్పందించారు.  మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉండేందుకే ఇప్పుడు తన రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారన్నారు.  రాజ్యసభ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తా అన్నారు. అరాచకం చేస్తున్న వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో నేను ఓటేయాలనుకున్నా.. కానీ, రాజీనామాతో నన్ను ఓటింగ్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. అయినా, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా నాకున్న మార్గాలేంటి? అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటాను అన్నారు.

సీఎం జగన్‌లో రాజ్యసభ సీట్ల భయం కన్పిస్తోంది.. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారని ఆయనకు అనుమానంగా ఉన్నట్టుందన్నారు గంటా శ్రీనివాసరావు.. ఈ ఘటనతో సీఎం వైఎస్‌ జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోంది. జగన్‌ది రాజకీయ దివాళాకోరు తనమే. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు నన్ను సంప్రదించకుండానే ఆమోదించారు. గతంలో నేను స్పీకర్‌ను కలిసినప్పుడు ఆమోదించకుండా.. ఇప్పుడు ఆమోదించడమేంటీ..? అని నిలదీశారు.   తాను ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే అని ప్రకటించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.