మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. నాలుగు రోజుల క్రితమే గ్యాస్ సిలిండర్ పై 25 రూపాయలు పెంచిన ఆయిల్ కంపెనీలు సోమవారం మరో 25 రూపాయలు పెంచాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 819 రూపాయలకు చేరింది. ఫిబ్రవరి నెలలోనే గ్యాస్ సిలిండర్ ధరలను మూడు సార్లు పెంచాయి ఆయిల్ కంపెనీలు. గడిచిన డిసెంబర్ 1 నుంచి వంటగ్యాస్ పై 225 రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. డిసెంబర్ 1న 14 కిలోల సిలిండర్ ధర 594 రూపాయలుగా ఉండగా…50 రూపాయలు పెంచడంతో 644 రూపాయలకు చేరింది. తర్వాత జనవరి 1న మరో 50 రూపాయలు పెంచడంతో 694 రూపాయలకు చేరింది.

ఫిబ్రవరి 4న మరో 25 రూపాయలు పెంచాయి.  ఫిబ్రవరి 14న  50 రూపాయలు పెంచుతూ వినియోగదారులపై భారం మోపాయి ఆయిల్ కంపెనీలు. దీంతో గ్యాస్ సిలిండర్ ధర 769 రూపాయలకు పెరిగింది. ఫిబ్రవరి 25న 25 రూపాయలు, ఇవాళ మరో 25 రూపాయలు పెంచడంతో  సిలిండర్ ధర 819 రూపాయలకు పెరిగింది. దీంతో సిలిండర్ రాయితీ భారీగా తగ్గిపోయింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ పైనా 95 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర 16 వందల 14 కు చేరింది. పెంచిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.