క‌రీంన‌గ‌ర్ జిల్లాలో గ్యాస్ దహన వాటిక 

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో  గ్యాస్  దహన వాటిక 

కరీంనగర్ జిల్లా: క‌రోనా డెత్ సంఖ్య పెరుగుతున్న క్ర‌మంలో ఇటీవ‌ల ప‌లు స్మశాన వాటిక‌ల్లో శ‌వాల‌ను కాల్చ‌డానికి క‌ట్టెల కొర‌త ఏర్ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే క‌ట్టెలు అవ‌స‌రంలేకుండా శ‌వాల‌ను కాల్చేందుకు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మొద‌టిసారిగా గ్యాస్ తో ప‌నిచేసే ద‌హ‌న వాటిక‌ను ఏర్పాటు చేశారు. మార్కండేయ కాలనీ స్మశానవాటికలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్యాస్ తో పనిచేసే దహన వాటిక అందుబాటులోకి వచ్చింది. దహన వాటిక కు అవసరమైన మిషనరీ, షెడ్డు కలిపి రూ. 23 లక్షల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. శనివారం తొలి కోవిడ్ మృతదేహాన్ని ఈ గ్యాస్ దహన వాటికలో దహనం చేశారు.

ఆహార భద్రత కార్డు ఉండి.. కోవిడ్ తో చనిపోయిన వారి మృతదేహాలను దహ‌నం చేసేందుకు రెండు వేల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. ఒక్కో శవ దహనానికి మనం ఇంట్లో వాడుకునే సిలిండర్ తో పోలిస్తే.. 1.5 సిలిండర్ల గ్యాస్ ఖర్చవుతుంది. మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత వచ్చిన చితాభస్మాన్ని కలశంలో పెట్టి అక్కడే భద్ర పరుస్తారు. కోవిడ్, నాన్ కోవిడ్ మృతదేహాలను ఇక్కడ దహనం చేసే అవకాశం ఉందని మేయర్ సునీల్ రావు తెలిపారు.