
పారిస్: బెలారస్ స్టార్ ప్లేయర్, వరల్డ్ నంబర్‌వన్ అరీనా సబలెంక.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సబలెంక 7–6 (7/1), 4–6, 6–0తో ఐదోసీడ్, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఇగా స్వైటెక్ (పోలెండ్)పై గెలిచి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. 2016 తర్వాత వరుసగా మూడు మేజర్ టోర్నీల్లో ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.
అంతకుముందు సెరెనా విలియమ్స్ ఈ ఫీట్ సాధించింది. ఇక ఈ టోర్నీలో స్వైటెక్ వరుసగా సాధించిన 26 విజయాలకు తెరపడింది. 2 గంటలా 19 నిమిషాల మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. చెరో సెట్ గెలిచి జోరు చూపెట్టారు. అయితే 24 నిమిషాల పాటు జరిగిన డిసైడర్‌లో మాత్రం సబలెంక పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. రెండో సెమీస్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో లోయిస్ బోయిసన్ (ఫ్రాన్స్)ను ఓడించింది.
బలమైన సర్వీస్‌లు, బేస్ లైన్ గేమ్‌తో ఆకట్టుకున్న గాఫ్ గంటలోనే ప్రత్యర్థికి చెక్ పెట్టింది. ప్రత్యర్థి సర్వీస్‌లను ఆరుసార్లు బ్రేక్ చేసిన గాఫ్ 12 విన్నర్లు కొట్టింది. ఇక బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఆరోసీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 4–6, 6–3, 6–2, 6–4తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై నెగ్గి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. గ్రాండ్‌స్లామ్స్‌లో సెమీస్‌కు చేరడం జొకోకు ఇది 51వ సారి.