
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించబోతోంది. రాబోయే 10 సంవత్సరాలలో రూ. 7 లక్షల కోట్ల మూలధనాన్ని ఖర్చు చేయనుంది. భారతదేశంలో మౌలిక సదుపాయాల లీడర్‌గా తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్(గతంలో ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. వచ్చే 10 సంవత్సరాలలో రూ. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మైనింగ్, ఎయిర్‌పోర్ట్‌లు, డిఫెన్స్, ఏరోస్పేస్, సోలార్ తయారీ, రోడ్లు, మెట్రో రైలు, డేటా సెంటర్‌లు, రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో కొత్త వ్యాపారాలను ఇంక్యుబేట్, అభివృద్ధి చేస్తుంది. పర్యావరణ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోంది. "2025 నాటికి కార్బన్- న్యూట్రల్ పోర్ట్ ఆపరేషన్స్‌కు మారుతాం. 2040 నాటికి అదానీ పోర్ట్స్ నెట్‌జీరో కార్బన్ ఎమిషన్స్ సంస్థగా మారుతుంది. డీజిల్ ఆధారిత వెహికల్స్ అన్నింటినీ బ్యాటరీ వెహికల్స్‌గా మార్చుతాం. అదనంగా 1000 మెగావాట్ల క్యాప్టివ్ రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాం”అని అదానీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దేశంలోని అతిపెద్ద సీపోర్ట్ ఆపరేటర్. దీనికి తూర్పు, పశ్చిమ తీరాలలో ఓడరేవులు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 5000 హెక్టార్ల విస్తీర్ణంలోని మడ అడవులను రక్షిస్తామని అదానీ ప్రకటించారు.
మరింత గ్రీన్ఎనర్జీ
వేగంగా విస్తరిస్తున్న రెన్యువబుల్ ఇంధన వ్యాపారాన్ని సంస్థ మరింత అభివృద్ధి చేయనుంది. గుజరాత్‌లోని కచ్ ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌ను నిర్మిస్తున్నామని అదానీ చెప్పారు. రణ్ఎడారిలో 726 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది. ఇది రెండు కోట్ల ఇండ్లకు అవసరమైన కరెంటు (30 గిగావాట్లు) ను అందిస్తుంది. - గ్రూప్ సిటీ గ్యాస్ సంస్థ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ పైప్డ్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఈ–మొబిలిటీతో భారీగా విస్తరిస్తోందని చెప్పారు. అదానీ టోటల్ గ్యాస్ దేశంలోని అనేక నగరాల్లో వంట, పరిశ్రమలు, ఇండ్లు, ఆటోమొబైల్స్‌కు పైపుల నుంచి సీఎన్జీ సరఫరా చేస్తుంది. దీనితో పాటు, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయ వ్యర్థాలను సిటీ గ్యాస్ ఆపరేషన్‌లలో ఉపయోగించే గ్యాస్‌గా మార్చే ప్లాంట్లను నిర్మిస్తోంది. "మేము 2030 నాటికి 75 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తాం. మా 50 సైట్‌లు ఇప్పుడు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌తో నడుస్తున్నాయి. మా ఆపరేషన్స్ వెహికల్స్ పూర్తిగా డీజిల్ నుంచి సీఎన్జీకి మార్చేశాం" అని అదానీ చెప్పారు. అదానీ గ్రూప్ ఇటీవలి సంవత్సరాలలో డేటా సెంటర్లు, సిమెంట్, టెలికాం మీడియాతో సహా కొత్త వ్యాపారాలలోకి ప్రవేశించింది.
దూసుకెళ్తున్న విమానయాన వ్యాపారం
అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాల నిర్వహణ ఒప్పందాలను గెలుచుకుంది. అంతేకాకుండా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 73 శాతం వాటాను దక్కించుకుంది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 74 శాతం వాటాను కలిగి ఉంది. ముంబై ఎయిర్‌పోర్ట్ ఆసియా పసిఫిక్‌లో అత్యుత్తమమైనదని, ఒకే రన్‌వేపై ఒకే రోజు 1,032 విమానాలను హ్యాండిల్ చేసిన ఘనతను సొంతం చేసుకుందని అదానీ అన్నారు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీని వాడి దీనిని సస్టెయినబుల్ ఎయిర్‌పోర్టుగా మార్చామని ప్రకటించారు. ముంబైకి విద్యుత్ సరఫరాదారు చేసే అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎలక్ట్రిసిటీ కూడా పర్యావరణానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. 2027 నాటికి ముంబైకి 60 శాతం రెన్యువబుల్ ఎనర్జీని అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతం 38 శాతానికి పైగా గ్రీన్ఎనర్జీ సరఫరా చేస్తున్నామని వివరించారు. సిమెంట్ వ్యాపారంపై మాట్లాడుతూ సిమెంట్ పరిశ్రమలో సుస్థిర విప్లవానికి అంబుజా, ఏసీసీ నాయకత్వం వహిస్తున్నాయన్నారు. సిమెంట్ తయారీలోనూ పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 2028 నాటికి తమ సిమెంట్ ఉత్పత్తికి అవసరమయ్యే కరెంటు 60 శాతం రెన్యువబుల్ ఎనర్జీని వినియోగిస్తామన్నారు.