ధోనీ గురించే మాట్లాడుకుంటారు..యువరాజ్ అసలు హీరో: గంభీర్

ధోనీ గురించే మాట్లాడుకుంటారు..యువరాజ్ అసలు హీరో: గంభీర్

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి 2011 ప్రపంచ కప్ ను తెర మీదకు తీసుకొచ్చాడు. కొంతమంది ఆటగాళ్ల PR వారిని హీరోలుగా మారుస్తుందని.. మరికొందరు 'అండర్ డాగ్స్' అనే ట్యాగ్‌తో సరిపెట్టుకోవాలని సూచించారు. 2011 ప్రపంచకప్‌లో స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌' గా నిలిచినా అతనికి సరైన గుర్తింపు దక్కలేదని భావించాడు. 

గంభీర్ మాట్లాడుతూ.. "2011లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన యువరాజ్ సింగ్ గురించి ఎంత మంది మాట్లాడుతున్నారో  దయచేసి నాకు చెప్పండి. బహుశా యువీకి మంచి PR(పబ్లిక్ రిలేషన్) ఏజెన్సీ లేదు. భారత్ గెలిచే సమయానికి, అందరికి ధోనీ ఆడిన ఇన్నింగ్ మాత్రమే గుర్తుంటుంది. కానీ టోర్నీ అంతటా వీరోచిత పోరాటం చేసిన యువీకి ఎవరు గుర్తు పెట్టుకోలేదు. మీరు వ్యక్తులను చూపించకపోతే వారికి తెలియదు. మీరు ఒక వ్యక్తిని చూపిస్తూనే ఉంటే అప్పుడు అతను బ్రాండ్ అవుతాడు" అని గౌతమ్ గంభీర్ ANI పోడ్‌కాస్ట్‌లో స్మితతో అన్నారు. 
 
2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ 362 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టి నాలుగు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను గెలుచుకున్నాడు. ఫైనల్లో రెండు కీలక వికెట్లు తీసిన యువీ.. 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు గంభీర్ 97 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఫైనల్లో ధోనీ 91 పరుగులు చేసి మ్యాచ్ ను ఫినిష్ చేసాడు. గతంలో గంభీర్ 2011 ప్రపంచ కప్ విజయంలో ధోనీకే ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారని.. జట్టు సమిష్టిగా ఆడితేనే వరల్డ్ కప్ గెలిచామని అసంతృప్తి వ్యక్తం చేసాడు.