పెళ్లికి సిద్ధమైన లెస్బియన్ జంట

పెళ్లికి సిద్ధమైన లెస్బియన్ జంట

కేరళకు చెందిన ఆదిలా నసరీన్, ఫాతిమా నూరాలు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇరువురూ వధూవరులుగా మారి తమ ఫోటోలను షేర్ చేశారు. స్వలింగ సంపర్కులైన (లెస్బియన్స్) ఆదిలా నసరీన్, ఫాతిమా నూరాలు కొన్నాళ్లు సహజీవనం చేశారు. అయితే ఈ జంటను వారి తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. దీంతో కోర్టును ఆశ్రయించగా సహజీవనం చేసే పూర్తి స్వేచ్ఛ వారికి ఉందంటూ మే నెలలో కేరళ కోర్టు తీర్పునిచ్చింది. నూరా, సనరీన్ లు కలిసి ఉండేందుకు అనుమతించింది.తాజాగా ఎర్నాకులం జిల్లాలోని సముద్ర తీరంలో ఉంగరాలు, దండలు మార్చుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. ఫాతిమా నూరా ఈ ఫోటోలను తన ఫేస్ బుక్‭లో ‘టు గెదర్ ఫరెవర్’ అంటూ షేర్ చేయటంతో.. నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

నూరా, నసరీన్‌లు హై స్కూలు నుంచి స్నేహితులు. అప్పటి నుంచే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. స్కూలు నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ మూడేళ్ల పాటు కేరళలోనే వేర్వేరు జిల్లాల్లో విడివిడిగా ఉన్నారు. తమ కుటుంబాలతో నివసిస్తూ డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలో వీలు దొరికినపుడు ఫోన్లలో మాట్లాడుకోవటం, చాట్ చేయటం చేసేవారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో  కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వారి ఇంట్లో ఓప్పుకోకపోవడంతో.. కేరళ కోర్టును ఆశ్రయించారు. తమలా జీవించాలి అనుకునే వారికి.. ఆర్థికంగా స్వతంత్రులు కావాలని వీరు సూచిస్తున్నారు. 

భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించటాన్ని 2018లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. లింగ వైవిధ్యత గురించి, ఎల్‌జీబీటీ క్యూ ప్లస్ సముదాయాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. అయితే ఇప్పటికీ సమాజంలో వీరి పట్ల వివక్ష, విముఖతలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లేదు. ఈ పెళ్లిళ్లకు కూడా చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిశీలనలో ఉన్నాయి. ఆ విషయం ఇంకా అలా ఉండగా.. చాలా లెస్బియన్ జంటలు వేడుకగా నిశ్చితార్థాలు చేసుకుంటున్నాయి.