గాజా పెద్దాసుపత్రి ఖాళీ .. వెళ్లిపోతున్న పేషెంట్లు, స్టాఫ్

గాజా పెద్దాసుపత్రి ఖాళీ .. వెళ్లిపోతున్న పేషెంట్లు, స్టాఫ్
  • అల్ షిఫా దవాఖాన నుంచి వెళ్లిపోతున్న పేషెంట్లు, స్టాఫ్
  • గంటలోగా ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఐడీఎఫ్ చెప్పింది: గాజా హెల్త్ ఆఫీసర్లు
  • మేం అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని ఐడీఎఫ్ క్లారిటీ
  • గాజాలో ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరణ

ఖాన్ యూనిస్:  గాజా పెద్దాసుపత్రి దాదాపు ఖాళీ అయింది. అల్ షిఫా హాస్పిటల్‌‌ నుంచి చాలా మంది పేషెంట్లు, మెడికల్ స్టాఫ్, యుద్ధ బాధితులు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గాజా హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ గాజాలోని పాలస్తీనీయులంతా తక్షణమే పశ్చిమ ప్రాంతానికి తరలివెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ఇజ్రాయెల్.. అల్‌‌- షిఫా ఆసుపత్రి హమాస్‌‌కు కేంద్రంగా మారిందని చెప్తున్నది. ఈ హాస్పిటల్‌‌ను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి ఖాళీ అవుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు గాజా స్ట్రిప్‌‌లో ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు. 

కమ్యూనికేషన్ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు రోజుకు 10 వేల లీటర్ల ఇంధనాన్ని అనుమతిస్తామని ఇజ్రాయెల్ చెప్పినట్లు అమెరికా వెల్లడించింది. శనివారం ఉదయం ఖాన్ యూనిస్‌‌ శివార్లలోని రెసిడెన్షియల్ బిల్డింగ్‌‌పై ఇజ్రాయెల్ చేసిన ఎయిర్‌‌‌‌స్ట్రైక్‌‌లో 26 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ ప్రజలు, సోల్జర్లు, పలువురు విదేశీయులు చనిపోయారు. 240 మందిని హమాస్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. దాడుల్లో 11,400 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. దాదాపు 2,700 మంది కనిపించకుండా పోయారు. వీరంతా శిథిలాల కిందే సమాధి అయ్యారని అధికారులు భావిస్తున్నారు. 

గాజా హెల్త్ ఆఫీసర్లు.. ఐడీఎఫ్.. చెరోమాట

అల్ షిఫా ఆసుప్రతిని ఖాళీ చేసే విషయంపై పాలస్తీనా అధికారులు, ఇజ్రాయెలీ మిలిటరీ ఆఫీసర్లు చెరో మాట చెబుతున్నారు. గంటలోగా ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం తమను ఆదేశించినట్లు గాజా హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. ‘‘ఆసుపత్రిని ఖాళీ చేయాలని మిలిటరీ ఆదేశాలిచ్చింది. ఒక గంటలో అందరినీ పంపేయాలని గడువు ఇచ్చింది” అని హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి మెధత్ అబ్బాస్ చెప్పారు. అయితే తాము అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. వేరేచోటికి వెళ్లాలని భావిస్తున్న వారికి సురక్షితమైన దారి కల్పిస్తామని మాత్రమే చెప్పినట్లు పేర్కొంది. ‘‘ఈ రోజు ఉదయం అల్ షిఫా ఆసుపత్రి డైరెక్టర్ నుంచి ఓ రిక్వెస్ట్ వచ్చింది. ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి సురక్షిత మార్గం ఏర్పాటు చేయాలని కోరారు” అని ఐడీఎఫ్ చెప్పింది. తాము ఎలాంటి ఎవాక్యుయేషన్ ఆర్డర్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. తరలించేందుకు వీలులేని పేషెంట్లకు సపోర్టుగా మెడికల్ సిబ్బంది అక్కడే ఉండేందుకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఆసుపత్రిలో అదనంగా ఆహారం, నీరు, ఇతర నిత్యావసరాలను ఉంచినట్లు చెప్పింది.

పిల్లలను చంపాలని ‘తోరా’లో కూడా లేదు: టర్కీ ప్రెసిడెంట్

ఆసుపత్రులపై కాల్పులు జరపాలని, పిల్లలను చంపాలని తోరా (హిబ్రూ బైబిల్‌‌లోని మొదటి ఐదు పుస్తకాల సంకలనం)లో కూడా లేదని టర్కిష్ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్ అన్నారు. ప్రార్థనా స్థలాలు, చర్చిలు, ఆసుపత్రులపై ఇజ్రాయెల్ సైనికులు దాడులు చేస్తున్నారని  మండిపడ్డారు. జర్మనీ చాన్స్‌‌లర్ ఓలాఫ్ ష్కోల్జ్‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్‌‌కు రుణపడి ఉన్నామని భావించే వాళ్లు స్వేచ్ఛగా మాట్లాడలేరని అన్నారు. తాము ఇజ్రాయెల్‌‌కు ఏమీ రుణపడి లేమని, అందుకే స్వేచ్ఛగా మాట్లాడగలమని చెప్పారు. 

నెతన్యాహును చంపాలి: కాంగ్రెస్ ఎంపీ

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కేరళ కాంగ్రెస్ ఎంపీ రాజ్‌‌మోహన్ ఉన్నితన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాసర్‌‌‌‌గడ్‌‌లో జరిగిన పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో ఆయన  మాట్లాడుతూ.. నెతన్యాహు యుద్ధ నేరస్తుడని, విచారణ లేకుండానే కాల్చి చంపాలన్నారు.