18 గ్రామాలకు స్థానిక ఎన్నికలు లేనట్లే!

18 గ్రామాలకు స్థానిక ఎన్నికలు లేనట్లే!
  • సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు గెజిట్ విడుదల 
  • తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు 

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్ ​చెరువు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్​ విడుదల చేసింది. 2018 పంచాయతీ రాజ్​ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్​కు గవర్నర్​ జిష్ణు దేవ్​వర్మ  ఆమోదం తెలిపారు.  దీంతో ఆ పంచాయతీలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించనున్నారు. ఈ గ్రామాల ఓటర్లను మున్సిపాలిటీలో కలపనున్నారు. 

కొత్తగా రెండు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కేబినెట్​ తీర్మానం చేసింది. జిన్నారం, ఇంద్రేశంలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. వీటి పరిధిలోని పటాన్​చెరువులో 8 గ్రామాలు, జిన్నారంలో 10 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేసింది. దీంతో ఎంపీటీసీ స్థానాలతోపాటు ఒక ఎంపీపీ స్థానం కూడా తగ్గనున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అవి స్వల్పంగా తగ్గనున్నాయి. 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. జిన్నారం మండలం మున్సిపాలిటీలో కలవడంతో వీటి సంఖ్య 565కు చేరనున్నది. 

ప్రస్తుతం పంచాయతీల సంఖ్య 12,778 ఉండగా.. 12,760కి చేరనున్నది.  గతంలో 32 జడ్పీ లు ఉండగా.. మేడ్చల్​– మల్కాజిగిరి జిల్లా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఈ జిల్లా ఔట్​ అయింది. దీంతో జడ్పీల సంఖ్య 31కి చేరింది. కాగా,  ఇన్నాళ్లు ఈ గ్రామాల ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయగా.. ఇక నుంచి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. త్వరలోనే పంచాయతీరాజ్​శాఖ ఎంపీటీసీల డీలిమిటేషన్ షెడ్యూల్ కు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. 

ఉపాధి హామీ పథకానికి దూరం 

18 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆ గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పథకానికి దూరం కానున్నారు.  ఇప్పటి వరకు కాలంతో పనిలేకుండా ప్రజలకు ఉపాధి పథకంలో పనులు కల్పించేది. దీంతో వారికి ఆర్థిక భరోసా ఉండేది. అయితే, ఇక నుంచి ఈ గ్రామాలకు ఉపాధి హామీ పథకం వర్తించదు. ప్రభుత్వం స్పందించి తమకు ఏదో ఒక ఉపాధి కల్పించేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.