అటవీ ఉత్పత్తులు కొనేందుకు బడ్జెట్​ నిల్

అటవీ ఉత్పత్తులు కొనేందుకు బడ్జెట్​ నిల్
  • జీసీసీకి నిధులు కరవు

భద్రాచలం, వెలుగు :  అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు పైసలు లేక జీసీసీ విలవిల్లాడుతోంది. గత బీఆర్​ఎస్​ సర్కారు జీసీసీ(గిరిజన సహకార సంస్థ)ను  నిర్వీర్యం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ కార్పొరేషన్​కు కనీసం బడ్జెట్​ను కూడా ఇవ్వడం మరిచింది.  ఫలితంగా ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. ఆదివాసీలకు ఉపాధితో పాటు, వారికి ఆర్థిక భరోసా   లక్ష్యంతో ఏర్పడిన జీసీసీ ఇప్పుడు  అలంకార ప్రాయంగా మారింది.  ఆదివాసీలు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కిందటి ఏడాదిలో  రూ.3.50కోట్ల బడ్జెట్​ కోసం ఎస్టిమేషన్స్ పంపితే పైసా రాలేదు. అవి వస్తేనే గిరిజనుల ఉత్పత్తులను కొనే వీలుంది.

లేకుంటే  లేకుంటే అవి ప్రైవేటు వ్యాపారులపాలే. ఫండ్స్​ లేక జీసీసీ  స్టాఫ్​కు కూడా రెండు నెలలుగా వేతనాలు లేవు.. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగానే జీసీసీ నిర్వీర్యం అవుతోంది. కనీసం గిరిజనుల నుంచి  ముష్టిగింజలు కొనలేని  పరిస్థితి   నెలకొంది. కిలో ముష్టి గింజలు ధర రూ.45లు ఉండేది. ఆదివాసీలకు గిట్టుబాటు ధరను కల్పించాలని, దళారులను, ప్రైవేటు వ్యాపారులకు చెక్​ పెట్టాలనే ఉద్దేశ్యంతో అధికారులు కిలో ధర రూ.70గా నిర్ణయించారు.  ఇదే ధర  చెల్లిస్తామని  ప్రచారం కూడా చేశారు.  కానీ, కిందటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ నిర్ణయంపై అధికారుల తీరు మారింది.  

పాత ధర రూ.45కే కొనాలంటూ ఆదేశాలు  వచ్చాయి. 3వేల క్వింటాళ్లను కొనుగోలు చేసేందుకు భద్రాచలం జీసీసీ డివిజన్​ పరిధిలోని అన్ని దమ్మపేట, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు సొసైటీల్లో   ఏర్పాట్లు చేసుకున్నారు. రేటు విషయంలో ఆదివాసీలు జీసీసీ శానిటరీ ఇన్​స్పెక్టర్లను  నిలదీయడంతో ఆగిపోయింది. దీనితో ముష్టిగింజల కొనుగోళ్లు నలిచిపోయాయి.  ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు జీసీసీయే చింతపండు, కారం, ఎండుమిర్చి సప్లై చేస్తుంది. కానీ బడ్జెట్​ రాక ఇవీ కొనలే.   జీసీసీలో అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు రోజు రోజుకు పడిపోతున్నాయి.

గత సర్కారు జీసీసీకి కనీసం పూర్తిస్థాయి ఎండీని నియమించకపోవడం, సరైన పర్యవేక్షణ లేకపోవడం, బడ్జెట్​ ఇవ్వకపోవడం తదితర కారణాలే ఇందుకు ప్రధాన కారణం. గతంలో అత్యధికంగా 2020–-21 ఆర్థిక సంవత్సరంలో రూ.249.16లక్షల విలువ చేసే అటవీ ఉత్పత్తులు కొంటే ఆ తర్వాత 2021–-22లో రూ.81.82లక్షలు, 2022-–23లో రూ.64.02 లక్షలు, 2023-24లో ఇప్పటి వరకు రూ.23.25లక్షలే కొనుగోలు చేశారు. దీనివల్ల ఆదివాసీలకు ఉపాధి పోయింది. కొత్త సర్కారు అయినా జీసీసీకి ఫండ్స్​ కేటాయించి, పూర్వవైభవం తేవాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది.  

బడ్జెట్​రాగానే కొంటాం: 

రూ.3.50కోట్లతో బడ్జెట్​ ప్రతిపాదనలు పంపినం. ఆ నిధులు రాగానే అటవీ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులు కొంటం. చింతపండు,మిర్చి ప్రధానంగా కొనాల్సి ఉంది. తప్పకుండా నిధులు వస్తాయి. ముష్టిగింజల ధర విషయంలో తేడా కారణంగానే కొనుగోలు చేయలేక పోయాం. గిరిజనులకు ఉపాధి   కోసం ఖచ్చితంగా జీసీసీ కట్టుబడి ఉంది.

విజయ్​కుమార్​, డీఎం, జీసీసీ ,భద్రాచలం