
- మార్చి క్వార్టర్లో వృద్ధి రేటు 7.8%
న్యూఢిల్లీ : మనదేశ జీడీపీ జనవరి–-మార్చి కాలంలో 7.8 శాతం పెరిగింది. అయితే 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయింది. తయారీరంగం సత్తా చూపడంతో జీడీపీ పెరిగిందని కేంద్రం ప్రకటించింది. ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ విలువను 3.5 ట్రిలియన్ల డాలర్లకు పెంచింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో 5- ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించవచ్చని ఎనలిస్టులు అంటున్నారు. అయితే 2022–-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందింది. 2024 మొదటి మూడు నెలల్లో చైనా 5.3 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక విస్తరణ 2024 జనవరి–-మార్చిలో 7.8 శాతంగా నమోదైంది. అయితే ఇది అక్టోబర్-–డిసెంబర్ 2023లో 8.6 శాతం, జూలై-–సెప్టెంబర్ 2023లో 8.1 శాతంగా ఉంది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం, ఏప్రిల్-–జూన్ 2023లో వృద్ధి 8.2 శాతంగా ఉంది. 2022–-23 జనవరి-–మార్చి క్వార్టర్లో జీడీపీ 6.2 శాతం పెరిగింది. ఎన్ఎస్ఓ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండవ ముందస్తు అంచనాలో, 2022-–23కి జీడీపీ వృద్ధిని 7.7 శాతంగా పేర్కొంది. 2022–-23 సంవత్సరానికి జీడీపీ మొదటి సవరించిన అంచనాల విలువ రూ. 160.71 లక్షల కోట్లు కాగా, 2023–-24లో స్థిరమైన ధరల వద్ద జీడీపీ రూ. 173.82 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా.
2022–-23లో 7.0 శాతంతో పోలిస్తే 2023-–24లో వాస్తవ జీడీపీలో వృద్ధి రేటును 8.2 శాతంగా అంచనా వేశారు. ప్రస్తుత ధరల ప్రకారం నామమాత్రపు జీడీపీ 2023-–24 సంవత్సరంలో రూ. 295.36 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా. 2022–-23లో వృద్ధి రేటు 9.6 శాతంగా ఉంది. 2023–-24లో రియల్ జీవీఏను (స్థూల విలువ జోడింపు) రూ. 158.74 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఉత్పాదక రంగంలో జీవీఏ వృద్ధి మార్చి క్వార్టర్లో 8.9 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం 0.9 శాతంగా ఉంది.
మెరుగుపడ్డ ద్రవ్యలోటు
2023–-24లో ప్రభుత్వ ద్రవ్య లోటు జీడీపీలో 5.63 శాతంగా ఉంది. ఇది స్వల్పంగా మెరుగుపడింది. బడ్జెట్‌లో దీనిని 5.8 శాతంగా అంచనా వేశారు. ద్రవ్య లోటు లేదా వ్యయం రాబడి మధ్య అంతరం రూ.16.53 లక్షల కోట్లుగా ఉంది. 2023–-24 సవరించిన అంచనాలో, ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం ద్రవ్య లోటును రూ.17.34 లక్షల కోట్లు లేదా జీడీపీలో 5.8 శాతంగా లెక్కగట్టింది. ఇదిలా ఉంటే ఈసారి ప్రభుత్వం ఆదాయ సేకరణ లక్ష్యాన్ని చేరుకోగలిగింది. 2024 ఆర్థికసంవత్సరంలో నికర పన్ను వసూళ్లు రూ.23.26 లక్షల కోట్లు కాగా, వ్యయం రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది.