ఐఏఎస్ ఇన్స్టా పోస్ట్.. ఎన్నికల విధుల నుంచి తొలగించిన ఈసీ

ఐఏఎస్ ఇన్స్టా పోస్ట్.. ఎన్నికల విధుల నుంచి తొలగించిన ఈసీ

ఓ ఐఏఎస్ అధికారి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఐఏఎస్ అభిషేక్ సింగ్ ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్.. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తొలగించేలా చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను ఈసీ గుజరాత్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. అహ్మదాబాద్లో బాపునగర్, అసర్వా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన జనరల్ అబ్జర్వర్గా వెళ్లారు. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేశారు.

అధికార వాహనం పక్కన నిల్చున్న ఫొటోతో పాటు తన బృందంతో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఐఏఎస్ పోస్ట్ చేశారు. ఇది ఈసీకి దృష్టికి వెళ్లడంతో ఆయనకు కేటాయించిన విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ‘‘ఆ ఐఏఎస్ అధికారి ఇన్స్టా పోస్ట్ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారిక హోదాను ఆయన పబ్లిసిటీ స్టంట్గా ఉపయోగించుకున్నారు. ఆయనను తక్షణమే అబ్జర్వర్ విధుల నుంచి తొలగిస్తున్నాం’’ అని పేర్కొంది. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎన్నికల సంబంధిత విధుల్లోకి తీసుకోకుండా డీబార్ చేసినట్లు తెలుస్తోంది.