హిందువులపై దాడులను ఖండిస్తూ.. జార్జియా అసెంబ్లీ తీర్మానం

హిందువులపై దాడులను ఖండిస్తూ.. జార్జియా అసెంబ్లీ తీర్మానం
  •     అమెరికాలో ఇలాంటి తీర్మానం ఇదే  మొదటిది

వాషింగ్టన్:  అమెరికాలో హిందువులపై జరుగుతున్న దాడులను, హిందూ ఫోబియా(హిందువులంటే అనవసర భయం)ను ఖండిస్తూ జార్జియా స్టేట్ అసెంబ్లీ తీర్మానం చేసింది. యూఎస్​లో హిందూ ఫోబియాను ఖండిస్తూ ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం ఇదే మొదటిసారి. ‘ప్రపంచంలోని అతిపెద్ద, పురాతన మతాల్లో హిందూ మతం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో 120 కోట్లకుపైగా ప్రజలు ఆ మతాన్ని అనుసరిస్తున్నారు. 

భిన్నమైన సంస్కృతులు, విశ్వాసాలు, పరమత సహనం, శాంతి సామరస్యాలతో వారు జీవనం సాగిస్తారు. అలాంటి మతంపై దాడులు సరికాదు” అని తీర్మానంలో అసెంబ్లీ పేర్కొంది. చట్టసభ ప్రతినిధులు లారెన్ మెక్ డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. హిందూమతాన్ని అనుసరించే కోట్లాది మంది ప్రజలు అన్ని మతాలను సమానంగా ఆదరిస్తారని, పరస్పరం గౌరవించుకుంటారని జార్జియా స్టేట్ అసెంబ్లీ వ్యాఖ్యానించింది. 

శాంతికి ప్రాధాన్యత ఇస్తారని, విలువలకు కట్టుబడి ఉంటారని పేర్కొంది. అలాంటి హిందూమతాన్ని కించపర్చడం గానీ, ఆ మతాన్ని అనుసరించే వారిపై దాడులు చేయడం గానీ సరికాదని వ్యాఖ్యానించింది. అమెరికా అభివృద్ధికి అమెరికన్ హిందువుల సేవలు కూడా వెలకట్టలేనివని కొనియాడింది.