రిసీవ్ చేసుకునే మంత్రి లేట్..ఫ్లైట్ డోర్ వద్దే జర్మనీ ప్రెసిడెంట్

రిసీవ్ చేసుకునే మంత్రి లేట్..ఫ్లైట్ డోర్ వద్దే జర్మనీ ప్రెసిడెంట్

దోహా :  ఖతార్ పర్యటనకు వెళ్లిన జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్- వాల్టర్ స్టీన్‌‌మీర్ కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం దోహా ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్న ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు ఖతార్ మంత్రి, ఆఫీసర్లు ఎవరూ అక్కడకు రాలేదు. దాంతో వాల్టర్ విమానం డోర్ వద్దే నిలబడిపోయారు. ఖతార్ ఆఫీసర్ల నుంచి ఆహ్వానం కోసం అర్ధగంటపాటు చేతులు కట్టుకుని వెయిట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్-మురైచాయ్ వచ్చి జర్మనీ ప్రెసిడెంట్ ను రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. కానీ మంత్రి, ఆఫీసర్లు ఆలస్యం కావడంతో దాదాపు అరగంట పాటు జర్మనీ అధ్యక్షుడు తన విమానం డోర్ వద్దే చేతులు కట్టుకుని నిలబడి ఎదురుచూశారు.

ఆ తర్వాత మంత్రి వచ్చి వెల్ కం చెప్పడంతో ఆయన విమానం దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌ అయింది. అయితే, ఎయిర్‌‌పోర్టులో 30 నిమిషాలు ఆలస్యం అయినప్పటికీ జర్మనీ అధ్యక్షుడు వాల్టర్, ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో అనుకున్న సమయానికే భేటీ అయ్యారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న జర్మన్ పౌరుల విడుదలపై చర్చించారు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని వాల్టర్ విజ్ఞప్తి చేశారు. జర్మన్ బందీలను విడుదల చేయడానికి ఖతార్ కృషి చేస్తుందని షేక్ తమీమ్ హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చల్లో ఖతార్ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో జర్మనీ ప్రెసిడెంట్ ఈ మేరకు ఖతార్ సహాయం కోరారు.