కోస్టారికాపై గెలిచినా.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన జర్మనీ

కోస్టారికాపై గెలిచినా.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన జర్మనీ

ఫిఫా వరల్డ్ కప్ 2022లో కోస్టారికాపై జర్మనీ విజయం సాధించింది. గ్రూప్ Eలో భాగంగా కోస్టారికాపై 4–2 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిచినా జర్మనీ నాకౌట్కు చేరుకోలేకపోయింది. ఈ గ్రూప్లో టాప్ పొజిషన్తో జపాన్, రెండో స్థానంతో స్పెయిన్ రెండు జట్లు రౌండ్ 16కు అర్హత సాధించాయి. 

జర్మనీ జోరు..

రౌండ్ 16కు చేరుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జర్మనీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మ్యాచ్ స్టార్టైన 10వ నిమిషంలో జర్మనీ తొలి గోల్ కొట్టింది. డేవిడ్ రౌమ్ ఇచ్చిన లాఫ్టెడ్ పాస్‌ను గ్నాబ్రీ సరిగ్గా ఉపయోగించుకుని గోల్ సాధించడంతో...జర్మనీ 1–0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఫస్టాఫ్ ముగిసే సరికి జర్మనీ ఆధిక్యాన్ని సాధించింది. 

శ్రమించిన కోస్టారికా

సెండాఫ్లో స్కోరు సమం చేసేందుకు కోస్టారికా పలు మార్లు ప్రయత్నించింది. అయితే కోస్టారికా ఆశలపై జర్మనీ గోల్‌కీపర్ నూయర్ నీళ్లు చల్లాడు. బంతి గోల్ పోస్టులోకి వెళ్లకుండా అడ్డుకున్నాడు.  అయితే 58వ నిమిషంలో కోస్టారికా ప్లేయర్ యెల్టిన్ టజేడా గోల్ కొట్టి స్కోర్లు సమం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కోస్టారికా ప్లేయర్ జువాన్ పాబ్లో వర్గాస్ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలచడంతో ఆ జట్టు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

చెలరేగిన జర్మనీ..

అనూహ్యంగా 2–1తో కోస్టారికా ఆధిక్యంలోకి రావడంతో..జర్మనీ ఓటమి ఖాయం అనుకున్నారు. ఈ సమయంలో  కాయ్ హావెర్జ్ అద్భుతం చేశాడు. 73, 85వ నిమిషాల్లో  రెండు గోల్స్ సాధించి జట్టుకు 3–2తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. లాస్ట్లో  నిక్లాస్ ఫుల్‌క్రగ్ మరో గోల్ చేయడంతో జర్మనీ 4–2తో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో జర్మనీ విజయం సాధించినా నాకౌట్కు చేరలేకపోయింది. జపాన్ చేతిలో స్పెయిన్ ఓడిపోవడంతో జర్మనీ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.

92 ఏళ్ల తర్వాత మొదటిసారి..

మరోవైపు 92 ఏళ్ల ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో  జర్మనీ వరుసగా రెండు ప్రపంచకప్లలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం ఇదే మొదటిసారి. గతంలో 2018 ఫిఫా వరల్డ్ కప్లో జర్మనీ తొలి రౌండ్‌లో ఇంటిదారి పట్టింది. ప్రస్తుతం కోస్టారికాపై గెలిచినా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.