ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి.. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు

ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి..  ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు

హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మంగళవారం బల్దియా హెడ్డాఫీసులో హైదరాబాద్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం మినహా, 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. 26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుందని, ఉపసంహరణకు 29 వరకు గడువు ఉందని చెప్పారు. మే13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.

ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్​దాఖలు చేయొచ్చని, అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు రూ.95 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయొచ్చన్నారు. క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలను తప్పనిసరిగా న్యూస్ పేపర్లలో ప్రచురితం చేయాలన్నారు. జిల్లాలో 1675 లొకేషన్లలో 3,986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణ సిబ్బందికి శిక్షణను ఇచ్చామని తెలిపారు. ఓటింగ్ శాతం పెంచేలా విస్తృతంగా వివిధ స్వీప్ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి హైదరాబాద్ కలెక్టరేట్​లో కలెక్టర్​ అనుదీప్ ​నామినేషన్ పత్రాలను స్వీకరిస్తానని, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సీఈఓ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.

సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీసులో జోనల్ డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సీపీ అవినాష్ మహంతి మంగళవారం సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పోలీస్​సిబ్బందికి ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్​ఉన్న వారిని బైండోవర్​చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు.