
మేడ్చల్ జిల్లా: తమను ఓట్లు అడగాలంటే ముందు తమ ప్రాంతంలో రోడ్లను వేయాలని ఓట్ల కోసం వచ్చే నాయకులను అడుగుతున్నారు కాలనీ వాసులు. మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాప్రాల్ నుండి జవహర్ నగర్ కు వెళ్లే ప్రధాన రహదారి గత కొద్ది సంవత్సరాల నుండి గుంతలు పడి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల దాదాపు 10 కాలనీలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల నేపథ్యంలో యాప్రాల్ 136 డివిజన్ లో మేఘాద్రి హైట్స్ లో రోడ్డు వేయండి,ఓట్లు అడగండి(no road, no vote)అనే నినాదంతో బోర్డు వెలిసింది. కాలనీల్లోని ప్రజలు తమ ఇండ్ల ముందు రోడ్డు ఇంత అద్వానంగా ఉండేసరికి ఇండ్లలో నుండి బయటకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ఓట్లకి వచ్చే నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వారయినా సరే, తమ కాలనీలోని రోడ్లను బాగు చేయాలని అన్నారు. తమ కాలనీల్లో కనీసం 10000 వేలకు పైనే ఓట్లు ఉన్నాయని, మాకు ఎవరయితే రోడ్డు వెయిస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేస్తామని, రోడ్డు వేయని పక్షంలో అసలు ఓట్లకే వెళ్లబోమని స్పష్టంచేశారు.