ఎర్లీబర్డ్ కలెక్షన్ రూ.898 కోట్లు .. GHMC ఆఫర్​కు ట్యాక్స్​ పేయర్ల నుంచి భారీ స్పందన

ఎర్లీబర్డ్ కలెక్షన్ రూ.898 కోట్లు .. GHMC ఆఫర్​కు ట్యాక్స్​ పేయర్ల నుంచి భారీ స్పందన
  • చివరి రోజు రూ.100.15 కోట్ల ఆదాయం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎర్లీబర్డ్ స్కీమ్ తో బల్దియాకు భారీగా ఆదాయం వచ్చింది. బుధవారంతో స్కీమ్​గడువు ముగియగా, నెలరోజుల్లో రూ.898.40 కోట్ల కలెక్షన్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది రూ.831 కోట్లు రాగా, ఈ సారి రూ.67 కోట్లు అదనంగా వచ్చింది. ఏటా ఎర్లీబర్డ్ అమలు టైంలో జీహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకుంటోంది. ఈ ఏడాది రూ.850 కోట్లు రాబట్టాలని నిర్ణయించగా, అంతకు మించి వసూలైంది. ప్రతిసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎర్లీబర్డ్​స్కీమ్ ను అమలు చేస్తున్నారు. దీని కింద ప్రాపర్టీ ట్యాక్స్​కట్టిన వారికి ఐదు శాతం రిబెట్ లభిస్తుంది.

7 లక్షల మంది నుంచి రెస్పాన్స్ 

ఎర్లీబర్డ్ కింద రిబెట్​పొందేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. గతేడాది 6,58,000 మంది ప్రాపర్టీ దారులు ఎర్లీ బర్డ్ స్కీమ్​ను సద్వినియోగం చేసుకోగా, ఈ సారి  7,91,701 మంది ఉపయోగించుకున్నారు. చివరి రోజైన బుధవారం ఒక్కరోజే ఎర్లీబర్డ్​ ద్వారా 62,477 మంది ప్రాపర్టీ ట్యాక్స్​ కట్టారు. దీంతో ఒక్కరోజులో బల్దియాకు రూ.100.15 కోట్ల ఆదాయం వచ్చింది. 

ఏటా పెరుగుతున్న ఆదాయం

జీహెచ్ఎంసీలో ఎర్లీబర్డ్ స్కీమ్​ను తొమ్మిదేండ్లుగా అమలు చేస్తున్నారు. 2017-–18లో రూ.362 కోట్లు, 2018-–19లో రూ.432కోట్లు, 2019–20లో రూ.535 కోట్లు, 2020–-21లో రూ.572 కోట్లు, 2021-–22(కరోనా టైం)లో రూ.541 కోట్లు, 2022-–23లో రూ.743 కోట్లు, 2023–24లో రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది రూ.750 కోట్ల టార్గెట్​ కాగా, రూ.831 కోట్లు వచ్చింది.