17న కుక్కపిల్లల దత్తత మేళా

17న కుక్కపిల్లల దత్తత మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రేమతో నిండిన ఒక చిన్న ప్రాణానికి మీరు ఇల్లు ఇస్తారా? అంటూ ఇండీ కుక్కపిల్లల దత్తతకు జీహెచ్ఎంసీ వినూత్న రీతిలో ఆహ్వానం పలుకుతోంది. ‘హీరోగా ఉండండి, దత్తత తీసుకోండి, షాపింగ్ వద్దు’  అనే నినాదంతో బంజారా హిల్స్ రోడ్ నంబర్​1లోని జలగం వెంగళరావు పార్క్ లో ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి10 గంటల వరకు ఇండీ కుక్కపిల్లల ప్రత్యేక దత్తత మేళా నిర్వహిస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. 

దత్తత కోసం వచ్చే డాగ్ లవర్స్ కోసం డీ వార్మింగ్ చేసి, టీకాలు వేసిన, ఆరోగ్యకరమైన, నమ్మకమైన ఫ్రెండ్లీ కుక్క పిల్లలను ప్రదర్శనగా ఉంచుతున్నట్టు చెప్పారు. వీటి సంరక్షణ కూడా సులభమేనని తెలిపారు. దత్తత పూర్తిగా ఉచితమని, కావలసింది ప్రేమ మాత్రమేనని జీహెచ్ఎంసీ పిలుపునిస్తున్నది. ఈ విషయాన్ని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.