
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ–-వేస్ట్ సేకరణపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్లో ఈ–-వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయించారు. ఇటీవల జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో 2.5 టన్నుల ఈ–-వేస్ట్ తొలగించారు.
ఇక్కడే ఇంత వేస్టేజ్ బయట పడిందంటే గ్రేటర్లో మొత్తం వేల టన్నులు వెలువడే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలకు లేఖలు రాయడానికి బల్దియా సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసి, కాల్ చేస్తే ఈ–-వేస్ట్‌ను తీసుకెళ్లేందుకు 10 వాహనాలను రెడీ చేయనుంది.
ఈ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్‌ను కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ ఆఫీసుల్లోనూ ఈ-–వేస్ట్‌ను డంపింగ్ యార్డుకు తరలించాలని డీసీ, జోనల్ కమిషనర్లకు సూచించారు.