
- వర్షాకాలంలోపు ఎన్ని బిల్డింగులు ఉన్నాయో సర్వే చేయండి
- అధికారులకు బల్దియా కమిషనర్ ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్వేలు నిర్వహించి శిథిల భవనాలు, కట్టడాలు, పాత ప్రహరీ గోడలను గుర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గుర్తించిన భవనాలపై ఇంజనీరింగ్ విభాగం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సర్కిల్ స్థాయిలో లిస్ట్ సిద్ధం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న సర్కారు స్కూళ్లను గుర్తిస్తే విద్యా శాఖ అధికారులకు చెప్పాలన్నారు.
గుర్తించిన శిథిలావస్థ భవనాలకు నోటీసులు ఇవ్వాలని, అత్యంత ప్రమాదకరంగా ఉన్న బిల్డింగుల్లో జనాలు ఉంటే తక్షణమే ఖాళీ చేయించాలన్నారు. సీల్ వేయాలని, భవనాల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. భవన యజమానులు రిపేర్లు చేయిస్తామంటే జీహెచ్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసి నిర్ధారించాలని, శిథిల భవనాల కూల్చివేతకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
ప్రతి భవనం వివరాలను గూగుల్ స్ప్రెడ్ షీట్‌లో అప్‌డేట్ చేయాలని, నివేదికను జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సమర్పించాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్లు తమ సర్కిళ్లలో ఈ ప్రక్రియను సమీక్షించి నిర్ధేశిత గడువులోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.