
మేయర్ విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతున్న జీహెచ్ఎంసీ 2023, 2024 బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎజెండాను అందరూ కార్పొరేటర్లకు ముందుగానే పంపించామని అప్పుడు మాట్లాడాల్సి ఉండేదని ఆమె చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ ఆమోదం పొందిందని తెలిపారు. రూ.6,224 కోట్ల బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని మేయర్ విజయలక్ష్మీ వివరించారు.
చర్చా సమయాన్ని వృధా చేయకుండా అందరూ సంయమనం పాటించాలని మేయర్ విజయలక్ష్మీ కోరారు. చర్చలు జరగాలి అనుకుంటే సహకరించాలన్నారు. మేయర్ పోడియం దగ్గరకు రావడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు ఎలాంటి సమస్యలు దొరకడం లేదు కాబట్టి ముందస్తు ప్లాన్‌తో వచ్చారని ఆమె ఆరోపించారు. ఇక సభ ప్రారంభంలోనే విపక్ష కార్పొరేటర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మేయర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. కాంట్రాక్టర్ల కాళ్ళు మొక్కినా పనులు కావడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు.