సర్కారు బడుల్లో సమ్మర్​ క్యాంపులు .. 81 స్కూళ్లల్లో కొనసాగుతున్న శిక్షణలు

సర్కారు బడుల్లో సమ్మర్​ క్యాంపులు .. 81 స్కూళ్లల్లో కొనసాగుతున్న శిక్షణలు
  • యంగ్​ ఇండియా క్యాంపులతో స్టూడెంట్లలో జోష్​

జనగామ, వెలుగు: సర్కారు బడి స్టూడెంట్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మార్కులు, ర్యాంకులే కాదు ఆటపాటల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తోంది. యంగ్​ ఇండియా పేరుతో సమ్మర్​ క్యాంపులను నిర్వహిస్తూ నైపుణ్యాలకు పదును పెడుతోంది.  

జనగామలో 81 స్కూళ్లలో శిక్షణ

స్టూడెంట్లలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని సర్కారు స్టేట్​వైడ్​గా సమ్మర్​ క్యాంపులు చేపడుతోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 81 స్కూళ్లలో యంగ్​ఇండియా క్యాంపులను నిర్వహిస్తున్నారు. 71 ఉన్నత, 9 ప్రైమరీ స్కూళ్లలో ఈనెల 8 నుంచి శిబిరాలు ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు కొనసాగే ఈ శిబిరాల్లో అంతర్గత సామర్థ్యానికి పదును పెడుతున్నారు. 

చెస్, క్యారమ్స్​వంటి ఇండోర్​గేమ్స్, కుట్లు, అల్లికలు, బొమ్మల తయారీ, డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, డ్రమ్స్​వాయించడం, సింగింగ్, ఏక పాత్రాభినయం, మిమిక్రీ, యోగా, స్పీడ్​ మ్యాథ్స్, పెయింటింగ్, స్పోకెన్​ఇంగ్లీష్, కంప్యూటర్​ఎడ్యుకేషన్, కథలు చెప్పడం, రాయడం, చేతిరాత మెరుగుపర్చుకోవడం, వ్యక్తిత్వ వికాసం, సైన్స్​ఎగ్జిబిట్స్​తయారీ, సామాజిక సేవ, తెలంగాణ సంప్రదాయ కళలు వంటి అంశాల పై శిక్షణ ఇస్తున్నారు.

స్టూడెంట్లలో జోష్..​

సమ్మర్​ క్యాంపుల్లో పాల్గొంటున్న స్టూడెంట్లలో జోష్​ నెలకొంది. 6 నుంచి 17 ఏండ్ల లోపు బాల బాలికలకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శిక్షణలు ఇస్తున్నారు. క్యాంపులు నిర్వహిస్తున్న స్కూళ్లలో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు సీనియర్​ టీచర్​పర్యవేక్షిస్తున్నారు. నిపుణులైన ఉపాధ్యాయులు ట్రైనింగ్​ ఇస్తున్నారు. యోగా, స్పీడ్​ మ్యాథ్స్, పెయింటింగ్​, స్పోకెన్​ ఇంగ్లీష్​లకు రూ.2500ల చొప్పున, డాన్స్, మ్యూజిక్, కంప్యూటర్​ స్కిల్స్, స్పోర్ట్స్​కు క్యాంపు కో ఆర్డినేటర్​కు రూ.5 వేలు, అసిస్టెంట్​కో ఆర్డినేటర్​కు రూ.3500ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఉదయం స్నాక్స్​అందిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో క్యాంపులను కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.