స్వయం ప్రకటిత బలూచిస్తాన్​ నిలబడేనా.?

స్వయం ప్రకటిత బలూచిస్తాన్​ నిలబడేనా.?

భారతదేశం మీడియాలో ఇటీవల బలూచిస్తాన్  గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్​ నుంచి విడిపోయి  బలూచిస్తాన్‌‌ను ప్రత్యేక దేశంగా మార్చాలని చాలా కాలంగా అక్కడ ఉద్యమం జరుగుతోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతే  పాక్​కు  ప్రాణాంతక దెబ్బ తగులుతుందా అని భారతీయులు ఆలోచిస్తున్నారు. ఇటీవల బలూచిస్తాన్​ ఉద్యమకారులు తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ, కేవలం ప్రకటనతోనే బలూచిస్తాన్​ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందలేదు. పాక్​ నుంచి విడిపోయి బలూచిస్తాన్​ స్వతంత్ర దేశంగా మనుగడ సాధించడం అంత సులభం కాదు. ఒకవేళ బలూచిస్తాన్​ విడిపోయి స్వాతంత్ర్యం పొందితే   పాకిస్తాన్​కు  కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టే.  కానీ, అది జరిగే అవకాశం ఉందా? అనేదే ఆసక్తికర అంశం. పాకిస్తాన్ విస్తీర్ణంలో దాదాపు 45% బలూచిస్తాన్ ఉంది. అయితే, పాకిస్తాన్​ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే బలూచిస్తాన్​ జనాభా కేవలం 6% మాత్రమే ఉంది. బలూచిస్తాన్​లో అపారమైన ఖనిజ సంపద ఉంది. చమురు, గ్యాస్ నిక్షేపాలతోపాటు సువిశాల సముద్ర తీరాన్ని కలిగి ఉంది. వాస్తవానికి బలూచిస్తాన్​ ఒక దేశానికి అవసరమైన అన్ని వనరులు, ఆస్తులను కలిగి ఉంది.  

బ లూచిస్తాన్ 1947కి ముందు నాలుగు రాచరికపు రాజ్యాలను కలిగి ఉండేది.  దానిలోని ఒక భాగాన్ని బ్రిటిష్ వారు పాలించారు. 1947 తర్వాత  బలూచిస్తాన్‌‌లోని కొంతమంది యువరాజులు ప్రత్యేక దేశాన్ని కోరుకున్నారు. కానీ, బ్రిటిష్ వారు 1948లో వారిని పాకిస్తాన్‌‌లో చేరమని ఒప్పించారు. అప్పటి నుంచి బలూచిస్తాన్  ప్రజలు తమ ప్రాంతం స్వతంత్ర దేశంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు.  నాటి నుంచి ప్రత్యేక దేశం కోసం  బలూచిస్తాన్​లో  ఉద్యమం కొనసాగుతోంది.  బలూచిస్తాన్‌‌ను  పాకిస్తాన్‌‌లోని ఇతర ప్రాంతాలు దోపిడీ చేస్తున్నాయి.  బలూచ్​లు  పాకిస్తాన్​ పౌరుల కంటే  వెనుకబడిపోయారు.  ప్రత్యేక దేశం కోసం బలూచ్‌‌లు తరచుగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నారు.  కానీ, వారి ఉద్యమ చర్యలు పాకిస్తాన్‌‌కు తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన కలిగించడానికి సరిపోవడం లేదు.  

కుర్దిస్తాన్​ వలె..?

రెండవ  ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త దేశాలు ఏర్పడ్డాయి. రష్యా విడిపోయింది.  కనీసం 10 కొత్త  దేశాలు ఏర్పడ్డాయి.  అప్పుడు  బ్రిటిష్  సామ్రాజ్యం పతనం అనేక కొత్త దేశాలకు దారితీసింది. కానీ, బలూచిస్తాన్ వంటి  ప్రాంతాలు కొత్త దేశంగా ఏర్పడటానికి చాలా 
అడ్డంకులు ఉన్నాయి. 

సూపర్​పవర్​ దేశం మద్దతు ఉంటే సులభం

కొత్తగా ఏర్పడిన దేశానికి  పొరుగు దేశాల నుంచి తక్షణ మద్దతు ఉండాలి.  బలూచిస్తాన్​ స్వతంత్ర దేశంగా ఏర్పడితే  ఆ పొరుగు దేశాలు  బలూచిస్తాన్ నుంచి పారిపోయే శరణార్థులు, సైనికులకు కూడా ఆశ్రయం ఇస్తాయి. ఒక సూపర్-పవర్  దేశం.. కొత్త దేశం ఏర్పాటుకు బహిరంగంగా మద్దతు ఇస్తే అది చాలా సులభం. బలూచిస్తాన్​ కొత్తదేశంగా ఏర్పడాలంటే పాకిస్తాన్ బలహీనంగా మారాలి.  ఆ పరిస్థితులు ఏర్పడితే బలూచ్ తిరుగుబాటుదారులను పాకిస్తాన్​ నియంత్రించలేకపోవచ్చు. దీంతోపాటు పాకిస్తాన్‌‌లో ఆర్థికమాంద్యం కొనసాగుతుండాలి. 

 పొరుగు దేశాల మద్దతు?

ఇప్పటివరకు  బలూచిస్తాన్​ ప్రత్యేక దేశంగా ఏర్పడటానికి  పొరుగు దేశాలు మద్దతు ఇవ్వలేదు. పొరుగు దేశాలు కూడా బలూచిస్తాన్​ స్వాతంత్ర్యంపై  నిశ్శబ్దంగా ఉన్నాయి. చైనా వంటి  కొన్ని దేశాలు పాకిస్తాన్‌‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి.  భారతదేశం కూడా బలూచిస్తాన్‌‌కు ప్రత్యక్ష పొరుగు దేశం కాదు. బలూచిస్తాన్ భారతదేశపు  సరిహద్దులో ఉంటే అది బలూచిస్తాన్‌‌కు పెద్ద లాభం చేకూరేది. 

 స్వతంత్రం కాగలదా?

ఈ ప్రపంచంలో ఏదైనా జరగవచ్చు.  కానీ, బలూచిస్తాన్​కు స్వాతంత్ర్యం కావాలంటే చాలా జరగాలి. పాకిస్తాన్  అనేక  సమస్యలను ఎదుర్కోవాలి.  అన్నివిధాలుగా బలహీనమైన దేశంగా  మారాలి. పాకిస్తాన్ ‘విఫలమైన దేశం’ మాత్రమే  కానీ పాక్​ బలహీనమైన దేశం కాదు.  ఎందుకంటే  పాకిస్తాన్​ సైనికపరంగా శక్తివంతమైనది. పాకిస్తాన్​ బలూచిస్తాన్‌‌ను ఉక్కుపాదంతో అణచివేసి పాలిస్తోంది. అక్కడ  కోర్టులు,  మీడియాకు స్వేచ్ఛ లేదు. బలూచిస్తాన్​ స్వాతంత్ర్యం పొందాలంటే   చైనా, పాకిస్తాన్  రెండు దేశాలు ఒకరికొకరు శత్రువులుగా మారాలి.  చైనా  కూడా బలూచిస్తాన్‌‌ను విడిచిపెట్టాలి. అది ప్రస్తుతం సాధ్యం కావడం లేదు.  పాకిస్తాన్​ విముక్త బలూచిస్తాన్ ఉద్యమం మరింత తీవ్రంగా మారాలి.  బలూచిస్తాన్​ సైన్యం, పాకిస్తాన్​ సైనికశక్తి ముందు సరిపోదు.

భారతదేశం పాత్ర

భారతదేశం ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశం.  మరొక దేశం విచ్ఛిన్నంలో భారత్​  పాల్గొనదు.  ప్రత్యేక బలూచిస్తాన్ దేశానికి భారతదేశం బహిరంగంగా మద్దతు ఇవ్వదు. బలూచ్ ప్రజలు తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొనడానికి,  ప్రత్యేక బలూచిస్తాన్ ఉద్యమానికి భారతదేశం ఆర్థిక సహాయం చేయగలదు. కానీ, భారతదేశం దానిని బహిరంగంగా చేయలేదు. బలూచిస్తాన్ ప్రజలు ఎదుర్కొంటున్న మానవ హక్కుల సమస్యలను ప్రపంచ దేశాల ముందు భారత్​ లేవనెత్తగలదు.  విదేశాలలో నిరసన తెలిపేందుకు బలూచ్‌‌కు కూడా ఆర్థిక సహాయం చేయగలదు. అయితే, భారత్​ బలూచిస్తాన్​ స్వాతంత్ర్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా  స్పష్టం కాలేదు. 

స్వతంత్ర బలూచిస్తాన్ నుంచి 
భారతదేశం లాభపడుతుందా?

బలూచిస్తాన్  పాకిస్తాన్‌‌ను  విడిచిపెడితే  భారతదేశం ఖచ్చితంగా లాభపడుతుంది.  జులై 2009లో  అప్పటి  భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈజిప్టులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి గిలానీని కలిసినప్పుడు, భారతదేశం భవిష్యత్తులో బలూచిస్తాన్‌‌ తిరుగుబాటు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదని ఆయనకు హామీ ఇచ్చారు.  అంటే, భారతదేశం  బలూచిస్తాన్ ప్రజలకు  రహస్యంగా సహాయం చేస్తోందని ఇది ధృవీకరించినట్టే.  భారత ప్రభుత్వం బహిరంగంగా ఏమీ చెప్పలేదు. మరోవైపు,  పాకిస్తాన్  మాత్రం పంజాబ్‌‌లోని ఖలిస్తానీ తిరుగుబాటుదారులను,  భారతదేశంలోని ఈశాన్యంలోని ఇతర తిరుగుబాటుదారులను బహిరంగంగానే ప్రోత్సహిస్తోంది.  రాబోయే కొన్ని వారాల్లో, బలూచిస్తాన్ ఉద్యమం ఎంత తీవ్రమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. బలూచిస్తాన్ స్వేచ్ఛ పొందాలంటే, అది చాలాకాలం పాటు పోరాడాలి.  త్వరలోనే  బలూచిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడుతుందని  ఇప్పటికిప్పుడు ఆశించలేమనే చెప్పాలి!

బలూచ్​ల అణచివేత

బలూచిస్తాన్‌‌లోని ఖనిజాలు, ఇతర సహజ వనరులపై  హక్కులను చైనా  లాక్కుంది. చైనా బలూచిస్తాన్‌‌లోని గ్వాదర్ వద్ద ఒక పెద్ద ఓడరేవును నిర్మించింది. అందువల్ల, బలూచిస్తాన్‌‌ను నియంత్రించడానికి చైనా తన శక్తిని ఉపయోగిస్తుంది. పాకిస్తాన్ వేలాది మంది బలూచ్‌‌లను చంపడంలో క్రూరంగా వ్యవహరించింది. బలూచ్‌‌లు  కూడా ముస్లింలే. కానీ వారిని తిరుగుబాటు అణచివేత పేరిట పాక్​క్రూరంగా చంపుతోంది.  అంతర్జాతీయ ఒత్తిడి లేదు.  ప్రతి సంవత్సరం వేలాది మంది బలూచ్‌‌లు పాకిస్తాన్​ దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు.  కానీ, ఏ పెద్ద దేశం కూడా పాకిస్తాన్​కు వ్యతిరేకంగా బలూచిస్తాన్​కు మద్దతుగా  తన స్వరాన్ని ఎత్తడంలేదు.

బలూచిస్తాన్‌‌ను పాక్​ సులభంగా వదులుకోదు

బలూచిస్తాన్‌‌లోని అపారమైన ఖనిజ సంపదను పరిగణనలోకి తీసుకుంటే, బలూచిస్తాన్‌‌పై తమ అధికారాన్ని కాపాడుకోవటానికి పాకిస్తాన్ ఎంతకైనా తెగిస్తుంది. పాకిస్తాన్ బలూచ్ తిరుగుబాటుదారులను కనిపించకుండా చేయడం అనే వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. హత్యలు బహిరంగంగా జరగవు.  తిరుగుబాటుదారులను, వారి కుటుంబాలను  కిడ్నాప్ చేసి  అదృశ్యం చేస్తారు.  బలూచిస్తాన్ గురించి మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. కానీ, బలూచిస్తాన్ వాస్తవానికి ప్రత్యేక దేశంగా మారడానికి అనుకూల పరిస్థితి  ఏర్పడవల్సింది ఇంకా చాలా ఉంది.