పాత భవనాలపై ఫోకస్..యజమానులకు బల్దియా నోటీసులు

పాత భవనాలపై ఫోకస్..యజమానులకు బల్దియా నోటీసులు
  •    వానాకాలం నేపథ్యంలో అధికారుల చర్యలు
  •     గత నెల నుంచి కొనసాగుతున్న సర్వే
  •     318 భవనాలు ఉన్నట్లు గుర్తింపు
  •      ప్రమాదంగా ఉన్నవాటి కూల్చివేత

హైదరాబాద్, వెలుగు : వానాకాలం కావడంతో  గ్రేటర్​లోని పురాతన భవనాలను బల్దియా అధికారులు గుర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే చేస్తోంది.  శిథిల భ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌నాలకు నోటీసులు జారీ, కూల్చివేయ‌‌‌‌‌‌‌‌డం, మ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ్మతులు, సీజ్ చేసే వంటి పనులను చేపట్టారు. గత నెలలో మొదలైన సర్వేలో ఇప్పటివరకు 318 పురాతన, శిథిల భవనాలను  బల్దియా గుర్తించింది. మరో 10 రోజులపాటు సర్వే కొనసాగనుంది. గుర్తించిన వాటిలో  కొన్నింటికి మరమ్మతులు అవసరం కాగా మరికొన్నింటిని కూల్చాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు.  

నోటీసులు ఇచ్చిన 318  మందిలో  232 మంది స్పందించారు. మిగతా 86 మంది రిప్లై ఇవ్వలేదు. ఇప్పటికే 20 భవనాలు కూల్చివేశారు. మిగతా వారిపై చర్యలకు అధికారులు రెడీ అయ్యారు.  గతేడాది గ్రేటర్​లో  620 పురాతన భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేసి  231 కూల్చివేశారు.  మిగతా వాటికి మరమ్మతులు చేసుకోవాలని సూచించారు.

నోటీసులు ఇచ్చిన తర్వాత..

జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్​బీనగర్ జోన్లలో ఇప్పటికే  పురాతన భవనాల గుర్తింపు సర్వే పూర్తైంది.  ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్ జోన్లలో  మరో 10 రోజుల్లో పూర్తి కానుంది. మరో వైపు గతేడాది నోటీసులు అందుకున్న వారి ఇండ్లు ఇంకా అలాగే ఉంటే కూల్చివేతకు ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమవగా.. వచ్చే రోజుల్లో వానలు ఎక్కువగా కురవనున్నాయి. అంతలోపు పురాతన భవనాలపై  సీరియస్​గా ఫోకస్ పెట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో  టౌన్ ప్లానింగ్ ఈ సారి సీరియస్​గా చర్యలు తీసుకుంటున్నది. 

కూలిపోయే స్థితిలో ఉండగా..

ఏడేండ్లలో 3 వేలకి పైగా పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు బల్దియా గుర్తించింది. ఇందులో 500 లకి పైగా కూలిపోయే స్థితిలో ఉండగా అధికారులు వాటిని కూల్చివేశారు. గతేడాది 620, ఈ ఏడాది  318 పురాతన భవనాలు గుర్తించారు. ఇంకా సర్వే కొనసాగుతుంది. నోటీసులు జారీ చేసి, అవసరమైన సూచనలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.  మరమ్మతులు సరిపోతాయనుకుంటే యజమానికి సూచించడంతో పాటు  మరమ్మతులు చేయకపోతే కూల్చివేత నోటీసు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.  

వర్షాలు పడి ప్రమాదాల బారిన పడకముందే స్వచ్ఛందంగా  స్పందించి యజమానులు వారికి వారే ముందస్తు చర్యలు తీసుకుంటే ఘటనలు జరగకుండా ఉంటుందని సూచిస్తున్నారు.  

ఫిర్యాదులు చేయొచ్చు 

వానాకాలం పూర్తయ్యేలోగా అధికారులు పురాతన భవనాలను గుర్తిస్తూనే ఉంటారు. శిథిలమైన వాటి గుర్తింపు ప్రాథమికంగా పూర్తి చేసి ఓ వైపు చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.  ప్రమాదకరంగా ఉన్న భవనాలపై జనం కూడా అధికారులకు ఫిర్యాదులు చేయొచ్చు.  040–21111111 నంబర్​తో పాటు వార్డు ఆఫీసుల్లో నేరుగా కంప్లయింట్లు అందించవచ్చు.  సమాచారం ఇచ్చినా తాము  చర్యలు తీసుకుంటామని అధికారులు సూచిస్తున్నారు.