
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేయడానికి గూగుల్‌తో బల్దియా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ప్రాపర్టీ ట్యాక్స్, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ చార్జీలను యూపీఐ ద్వారా చెల్లించేలా, సిబ్బంది చేతివాటం ప్రదర్శించకుండా ఖజానాకు చేరేలా ఈ విధానం తీసుకొస్తున్నారు. తరుచూ అక్రమాలు చోటుచేసుకునే ఎస్టేట్ విభాగంలోని అద్దెల వసూళ్లను కూడా డిజిటల్ చేయనున్నారు. ఎస్టేట్స్ విభాగం కింద జీహెచ్ఎంసీకి 3,995 వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఉండగా.. 945 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి.
వీటిని అద్దెకు కేటాయించేందుకు టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ట్యాక్స్ బకాయిలను రిమైండ్ చేయడంతో పాటు పేనౌ ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చి, బకాయిదారుడు కేవలం క్షణాల్లోనే పన్ను, ట్రేడ్ లైసెన్స్ చార్జీలను చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఇటీవలే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ ప్రక్రియ తుది దశలో ఉంది.