
- ఈసారి 2 నెలల ముందుగానే టార్గెట్ ఫిక్స్ చేసిన బల్దియా కమిషనర్
- గతేడాది రూ.2 వేల కోట్లు దాటిన కలెక్షన్
- జీఐఎస్ సర్వేతో ఆదాయం మరింత పెరిగే ఛాన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ను రూ.3 వేల కోట్లుగా డిసైడ్చేసింది. ఏటా సెప్టెంబర్ లో టార్గెట్ ఫిక్స్ చేస్తున్నప్పటికీ ఈ ఏడాది రెండు నెలల ముందుగానే కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. గతేడాది ఆస్తిపన్ను ద్వారా రూ.2,038.42 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు రూ.2 వేల కోట్ల లక్ష్యం పెట్టుకోగా, టార్గెట్ ని మించి ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఎప్పుడూ రూ.2 వేల కోట్లు దాటలేదు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,915 కోట్లు రాగా, 2022–23లో రూ.1,658 కోట్లు, 2021–22లో రూ.1,681 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు వచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే రూ.1,150 కోట్లు వచ్చింది. ఏటా ఆదాయం పెరుగుతుండడంతో ఈసారి టార్గెట్ ను మరో రూ.వెయ్యి కోట్లు పెంచారు.
జీఐఎస్ సర్వేతో ..
గ్రేటర్ లో అసలు ఆస్తులు ఎన్ని ఉన్నాయనే దానిపై బల్దియా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే(జీఐఎస్) చేయిస్తోంది. గ్రేటర్ లో ప్రస్తుతం 19.5 లక్షల ఆస్తుల నుంచి ట్యాక్స్ వస్తోంది. వీటిలో దాదాపు రెండున్నర లక్షల కమర్షియల్ ఆస్తులు ఉన్నట్టు డేటా ఉంది. అయితే, ఇప్పటివరకు సుమారు11 లక్షల ఆస్తులను నియో జియో సంస్థ సర్వే చేసింది. వీరి లెక్క ప్రకారం రెసిడెన్షియల్, కమర్షియల్ కలిపి దాదాపు 5 లక్షల ఆస్తుల నుంచి పన్ను రావడం లేదని గుర్తించారు. చాలా మంది ఒకటి, రెండు, మూడు ఫ్లోర్లకు పర్మిషన్తీసుకుని ఎక్కువ ఫ్లోర్లు వేసుకున్నట్టు గుర్తించారు. ఈ ఆస్తుల నుంచి దాదాపు రూ.500 కోట్ల వరకు ట్యాక్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, సర్వే గతేడాది జులైలో ప్రారంభం కాగా, వచ్చే ఏడాది జనవరిలో పూర్తి కానుంది. ఇంకొన్ని ఆస్తులు గుర్తిస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
గతేడాది తరహాలోనే కలెక్ట్..
ప్రాపర్టీ వసూళ్ల విషయంలో గతేడాది నుంచి జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిలకు సంబంధించి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఆస్తులను సీజ్ చేసి మరీ కలెక్ట్ చేస్తోంది. ఇలా గతేడాది చివర్లో వేలల్లో నోటీసులు జారీ చేసి వందల్లో ప్రాపర్టీస్ సీజ్ చేసి బకాయిలను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటి నుంచే టార్గెట్ రీచ్ అయ్యేందుకు సర్కిల్స్ వారీగా ప్లాన్ చేయాలని డిప్యూటీ కమిషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
అలాగే, జీఐఎస్ సర్వేలో పన్ను కట్టని వారిని గుర్తించి కలెక్ట్ చేసేలా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. సదరు ఆస్తిని ఎప్పుడు నిర్మించారు? ఎప్పటి నుంచి ట్యాక్స్ చెల్లించాల్సి ఉందనే వివరాలను సేకరించి యజమాని నుంచి పన్ను వసూళ్లు చేయనున్నారు.