ఇయ్యాల ( మే 1న) స్టాండింగ్ కమిటీ మీటింగ్​

ఇయ్యాల ( మే 1న) స్టాండింగ్ కమిటీ మీటింగ్​
  • కమిటీ ముందుకు11 అంశాలు
  • షాపులకు డిజిటల్​ బోర్డుల ఏర్పాటుకు అనుమతులిచ్చే ప్రతిపాదనలు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 11 ముఖ్యమైన అంశాలపై చర్చించి సభ్యులు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా షాపులకు ఎల్ఈడీ రొటేషన్​డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ప్రతిపాదనలు కమిటీ ముందుకు రానున్నాయి. షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించి అనుమతులు మంజూరు చేయాలని బల్దియా ప్లాన్ చేస్తోంది. ఇందులో ఎస్, ఏ, కేటగిరీల కింద రూ.5,500, బీ కేటగిరి అయితే రూ.5,250, సీ కేటగిరి అయితే    రూ.5,000 ఫీజు తీసుకోవాలని చూస్తోంది. అడ్వర్టైజ్​మెంట్ పాలసీపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే జీహెచ్ఎంసీ ఈ ప్రతిపాదనలు పెట్టడం చర్చనీయాంశమైంది.

 ఖాజాగూడ జంక్షన్, ఐఐటీ జంక్షన్, గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ ఆఫీస్ వరకు 215 అడుగుల రహదారి విస్తరణతోపాటు అభివృద్ధి, ఆ జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్ల నిర్మాణం, అంజయ్య నగర్ నుంచి రాంకీ టవర్ రోడ్డు వరకు 150 అడుగలరోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.749కోట్ల ఈపీసీ కింద టెండర్లకు ఆమోదం అంశాలు కమిటీ ముందుకు రానున్నాయి. గోపన్‌‌‌‌పల్లి విలేజ్‌‌‌‌లో రాంకీ ఫౌండేషన్ కు సీఎస్ఆర్ కింద అన్ని సౌకర్యాలతో జంతు సంరక్షణ కేంద్రం నిర్మాణం , నిర్వహణ కోసం ఇప్పటికే కేటాయించిన 4,350 గజాల స్థలాన్ని ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్‌‌‌‌కు వారి నిధులతో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయడం, వైద్య సదుపాయాల నిర్వహణ కోసం 25 సంవత్సరాల కాలానికి నామమాత్రపు రుసుంతో లీజుకు అనుమతించే అంశాలు రానున్నాయి. వీటితోపాటు మిగతా 8 అంశాల్లో ఆస్తుల సేకరణ, సీఎస్ఆర్ కింద పార్కుల అభివృద్ధి, చెరువుల అభివృద్ధి అంశాలు ఉన్నాయి.